మానవత్వానికి మతం అడ్డురాదని నిరూపించాడు | Sakshi
Sakshi News home page

మానవత్వానికి మతం అడ్డురాదని నిరూపించాడు

Published Sat, Jun 27 2015 9:59 AM

మానవత్వానికి మతం అడ్డురాదని నిరూపించాడు - Sakshi

న్యూఢిల్లీ: మానవత్వానికి మతం అడ్డురాదని ఓ ముస్లిం పైలట్ నిరూపించారు. ఇద్దరు అనాథ పిల్లల సంరక్షణ బాధ్యత తీసుకుని, తన ఇంట్లో సొంతబిడ్డల మాదిరిగా పెంచుకుంటూ ఆదర్శంగా నిలిచారు. సహోద్యోగులు, ఢిల్లీ హైకోర్టు నుంచి పైలట్ మహ్మద్ షానవాజ్ జహీర్ ప్రశంసలు అందుకున్నారు.

ఆయుష్, ప్రార్థన అనే కవల పిల్లల తల్లిదండ్రులు విమానయాన రంగంలో ఉద్యోగులు. తల్లి ఎయిర్హోస్టస్ కాగా తండ్రి పైలట్. సాఫీగా సాగిపోతున్న వీరి కుటుంబంపై విధి చిన్న చూపు చూసింది. 2012లో ఏడాదిలోపే తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. దీంతో పిల్లలిద్దరూ అనాథలయ్యారు. వీరి కుటుంబానికి నమ్మకంగా ఉన్న డ్రైవర్ కొంతకాలం పాటు వీరిని ఆదుకున్నాడు.

 

దగ్గరి బంధువులు కొందరు విదేశాల్లో ఉన్నారు. మరికొందరు ఈ చిన్నారులను పట్టించుకోలేదు. ఆ కుటుంబానికి చెందిన స్నేహితుడు పైలట్ జహీర్.. కవలల  సంరక్షణ బాధ్యతను తీసుకునేందుకు ముందుకు వచ్చారు. ఇద్దరికీ గార్డియన్గా ఉండేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ, పిల్లలను తనకు అప్పగించాలని కోరుతూ జహీర్ ఢిల్లీ హైకోర్టులో హిందూ మైనారిటీ గార్డియన్షిప్ చట్టం కింద సూట్ దాఖలు చేశారు.

కవల తండ్రి ప్రవీణ్ దయాల్ చనిపోయే ముందుకు పిల్లల సంరక్షణ బాధ్యతలు చూడాల్సిందిగా తనను కోరారని జహీర్ హైకోర్టుకు తెలిపారు. పిల్లలను జహీర్కు అప్పగించేందుకు ప్రవీణ్ సోదరుడు సంసిద్ధత వ్యక్తం చేశారు. జహీర్ను కవలలకు గార్డియన్గా నియమిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిల్లల పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి వారి తల్లిదండ్రులకు చెందిన ఆస్తులు, బ్యాంక్ ఖాతాలు, రావాల్సిన బీమా డబ్బులు అందులో జమచేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

 

పిల్లలను జహీర్ తన ఇంటికి తీసుకెళ్లి సొంతబిడ్డల్లా చూసుకుంటున్నారు. పిల్లలు జహీర్ కుటుంబసభ్యులతో కలసిపోయి కొత్తజీవితం ప్రారంభించారు. పిల్లలు హిందువులగానే పెరగాలని, వారు ఎప్పటికీ మతం మారాలని భావించడంలేదని జహీర్ చెప్పారు. పైలట్ అవుతానని ఆయుష్ చెప్పగా, డిజైనర్ కావాలని ఉందని ప్రార్థన చెప్పింది.

Advertisement
Advertisement