అంధులకు అండగా మైసూర్ రైల్వే స్టేషన్... | Sakshi
Sakshi News home page

అంధులకు అండగా మైసూర్ రైల్వే స్టేషన్...

Published Fri, Nov 6 2015 12:13 AM

అంధులకు అండగా మైసూర్ రైల్వే స్టేషన్...

ఇప్పుడు మైసూరు రైల్వే స్టేషన్... ఇండియాలోని అన్ని స్టేషన్లకంటే విభిన్నంగా ఆకట్టుకుంటోంది.  అంధ ప్రయాణీకులకు అండగా నిలుస్తోంది. దేశంలో మొట్ట మొదటిసారి స్పర్శను బట్టి తెలుసుకునే టెక్ టైల్ మ్యాప్ లు, ట్రైన్ షెడ్యూల్  లను బ్రెయిలీ లిపిలో స్టేషన్ లో ఆవిష్కరించడంతో  వారు స్వతంత్రంగా ప్రయాణించేందుకు తోడ్పడుతోంది.

దృష్టిలోపం ఉన్న వ్యక్తుల సంక్షేమం కోసం అనుప్రయాస్ పేరున పని చేస్తున్న ఓ ప్రభుత్వేతర సంస్థ.. నైరుతి రైల్వే అధికారులతో కలిసి ఓ నెల క్రితం ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించింది. అందులో భాగంగా మొదటి ఫేజ్ ను నవంబర్ 3న ప్రారంభించగా... మరో రెండు దశలకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

ముఖ్యంగా టాక్ టైల్ మ్యాప్ లలో మొత్తం  స్టేషన్ యొక్క భౌతిక రూపాన్నిఇమిడ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. స్టేషన్ ముఖద్వారంనుంచీ, ప్లాట్ ఫాంలు, కౌంటర్లు, మరుగుదొడ్లు వంటి ఇతర సౌకర్యాలను చేరుకునేందుకు వాటి దూరాన్ని వివరించే విధంగా తయారు చేస్తున్నారు. రైలు పేర్లు, షెడ్యూల్ ను అందించే విధంగా ఓ సైన్ బోర్డును కూడ ఏర్పాటు చేస్తున్నారు. అయితే వీటిలో ఎలక్ట్రానిక్ సైన్ బోర్డుల్లా ఎప్పటికప్పుడు ట్రైన్ సమాచారాన్ని మార్చే వీలుండదు. 400 మెటాలిక్ బ్రెయిలీ సంకేతాలతో ఉన్న ఈ బోర్లు ఒక్కో ప్లాట్ ఫాం లోనూ పదిచోట్ల ఏర్పాటు చేశారు. ఇవి ప్లాట్ ఫాం ఇన్ఫర్ మేషన్ తో పాటు, మెట్లు, రెయిలింగ్ వంటి వివరాలను కూడ అందిస్తాయి. అయితే స్టేషన్లోని రెస్టారెంట్లు, ఫలహార శాలలు, ఫుడ్ ప్లాజాల వివరాలు మాత్రం బ్రెయిలీ మెనూ కార్డులో పొందుపరచలేదు.

అనుప్రయాస్ సంస్థను స్థాపించిన 27 ఏళ్ళ పంచమ్ కాజ్లా  తన ఐదుగురు స్నేహితులతో ఈ బ్రెయిలీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టగా... మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు. ''రైల్వే శాఖలో భాగంగా నేను కొన్ని సంస్థలను, అంధులను కలుసుకున్నాను. బ్లైండ్ ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్ లో వారికి ఎలాంటి వసతులు కావాలో వివరాలు అడిగి తెలుసుకున్నాను.'' నైరుతి రైల్వే  టెలికాం ఇంజనీర్ ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు మాకు సహాయ పడ్డారు అని చెప్తున్నాడు అనుప్రయాస్ స్థాపకుడు పంచమ్.  ముఖ్యంగా భవిష్యత్తులో ఈ టాక్ టైల్ మ్యాప్ ను మెరుగుపరచడంలో భాగంగా డిజిటలైజ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. అంతేకాక రెండో దశలో వికలాంగులకు కూడ బ్యాటరీ కార్టు పరిచయం చేసే యోచనలో ఉన్నాడు పంచమ్.

Advertisement
Advertisement