గూఢచర్యాన్ని మరింత మెరుగుపర్చండి | Sakshi
Sakshi News home page

గూఢచర్యాన్ని మరింత మెరుగుపర్చండి

Published Fri, Nov 14 2014 12:28 AM

గూఢచర్యాన్ని మరింత మెరుగుపర్చండి - Sakshi

శాంతిభద్రతల సమీక్షలో పోలీసులకు ఎల్జీ సూచన
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల నగరంలో జరిగిన మతఘర్షణల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, తమ సమాచార సేకరణ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సూచించారు. గురువారం పోలీస్ కమిషనర్ బస్సీతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై నగరంలో శాంతిభద్రతల పరిస్థితిని ఆయన సమీక్షించారు. మతపరమైన హింసను నివారించేందుకు రహస్య సమాచార సేకరణ పద్ధతులను అభివృద్ధి పరచుకోవాలని సూచించారు.
 
పదిహేను రోజుల క్రితం నగరంలో జరిగిన మతఘర్షణలను అరికట్టడంలో పోలీసులు చేసిన కృషిని నజీబ్ జంగ్ ప్రశంసించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మరింత అప్రమత్తంగా మెలగాలని ఆదేశించారు. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని కమిషనర్ బీఎస్ బస్సీ చెప్పారు. సామాజిక సంబంధాలను ప్రోత్సహించేందుకు శాంతి కమిటీలను ఏర్పాటుచేశామని ఎల్జీకి వివరించారు.

ప్రజల్లో భయాందోళనలను తొలగించేందుకు తాము జిల్లా స్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు వింటున్నామని అధికారులు చెప్పారు. వచ్చే పక్షం రోజులకు సంబంధించి శాంతి భద్రతల ఏర్పాట్లను జంగ్ అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన సందర్భంగా మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన పోలీసులకు సూచించారు. నిరంకారి సమాగం వార్షికోత్సవం సందర్భంగా భారీగా ప్రజలు తరలి వస్తారని, అప్పుడు కూడా అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
 
ఇ-ప్లాట్‌ఫారంపైకి చేరడానికి చేపట్టిన చర్యలతో పాటు ఇ-పోలీసింగ్ అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి ఢిల్లీ పోలీసులు జరుపుతున్న కృషిని కూడా లెఫ్టినెంట్ గవర్నర్ సమీక్షించారు. ఢిల్లీ పోలీసులు విజయవంతంగా అమలుచేస్తోన్న ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ మొబైల్ యాప్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఆప్లికేషన్, ఢిల్లీ పోలీస్ లాస్ రిపోర్ట్ అప్లికేషన్‌లను ఆయన సమీక్షించారు.

నగర రోడ్లపై రద్దీని తగ్గించేందుకు  ఢిల్లీ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను ఆయన కొనియాడారు. లక్షల మంది సందర్శించే అంతర్జాతీయ మేళా వేలమంది హాజరయ్యే  వార్షిక నిరంకారీ సమాగంల దష్ట్యా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేసిన ఏర్పాట్లను కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు.

Advertisement
Advertisement