‘నమో’నామ సంవత్సరం! | Sakshi
Sakshi News home page

‘నమో’నామ సంవత్సరం!

Published Mon, Dec 29 2014 12:43 AM

రాష్ట్రపతిభవన్ ప్రాంగణంలో ప్రధానిగా ప్రమాణం చేస్తున్న నరేంద్ర మోదీ (ఫైల్) - Sakshi

 మోదీ నేతృత్వంలో బీజేపీ ఘనవిజయం
 యూపీఏ పుట్టిముంచిన వరుస కుంభకోణాలు
 మట్టికరిచిన కాంగ్రెస్


 నేషనల్ డెస్క్: 2014.. చరిత్ర విస్మరించలేని సంవత్సరం. భారతదేశ రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైన సంవత్సరం. బీజేపీ పునరుత్థాన సంవత్సరం. కాంగ్రెస్ చావుదెబ్బ తిన్న సంవత్సరం. కొత్త సమీకరణాలు, సరికొత్త ముఖాలు తెరపైకి వచ్చిన.. మరికొన్ని మొత్తంగా తెరమరుగైన సంవత్సరం.  మొత్తంగా 2014.. ‘నమో’ నామ సంవత్సరం. 2014 సంవత్సరం మొత్తాన్ని నరేంద్ర దామోదరదాస్ మోదీ(64) ఆక్రమించుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ప్రధాని అభ్యర్థిగా, గుజరాత్ సీఎం నరేంద్ర మోదీని బీజేపీ ప్రకటించిన క్షణం నుంచీ.. దేశ రాజకీయాల్లో ఆయన ప్రభావం ప్రారంభమైంది.

 దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకు 9 దశల్లో సుదీర్ఘంగా జరిగాయి. సార్వత్రిక ఎన్నికల చరిత్రలోనే ఈ ఎన్నికల్లో అత్యంత భారీగా 66.38% పోలింగ్ నమోదైంది. మే 16న వెలువడిన ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం కనిపించింది. 31% ఓట్లు సాధించి 282 స్థానాల్లో గెలిచి, మొట్ట మొదటిసారి సొంతంగా పూర్తి మెజారిటీ సంపాదించింది. మిత్రపక్షాలతో కలసి 336 సీట్లతో కేంద్రంలో మోదీ ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఘోరంగా ఓడిపోయింది. మొత్తంగా యూపీఏ 58 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ 44 స్థానాలతో ప్రధాన ప్రతిపక్ష హోదా సైతం సాధించలేకపోయింది. ఈ  గెలుపుతో మోదీ అటు పార్టీలోనూ, ఇటు దేశంలోనూ ఎదురులేని నేతగా నిలిచారు.

 బీజేపీని గెలిపించిన కాంగ్రెస్
 బీజేపీ విజయం ఒక రికార్డైతే.. కాంగ్రెస్ పరాజయం మరో రికార్డు. చరిత్రలోనే ఎన్నడూ ఎరగని దారుణ ఓటమిని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చవి చూసింది. దేశవ్యాప్తంగా ప్రాంతాలకతీతంగా మట్టికరిచింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు మోదీ ఇమేజ్, ఆయన సన్నిహితుడు అమిత్ షా వ్యూహాల కన్నా గత పదేళ్ల యూపీఏ వైఫల్యాలు ఎక్కువగా దోహదపడ్డాయి. ఆ పదేళ్లలో కామన్‌వెల్త్, 2జీ స్కాం, బొగ్గు కుంభకోణం.. ఒకదాన్ని మించిన స్కామ్ మరొకటి.. తెరపైకి వచ్చాయి.  ఈ పదేళ్లలో ప్రధానిగా మన్మోహన్‌కున్న ‘మిస్టర్ క్లీన్’ ఇమేజ్ కాస్తా ‘మిస్టర్ ఇనెఫిషియెంట్(అసమర్థ)’గా, ‘మౌన ముని’గా మారింది. మోదీకి దీటైన నేతగా రాహుల్‌గాంధీని కాంగ్రెస్ ప్రొజెక్ట్ చేయలేకపోయింది. మరోవైపు, పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బిహార్, మధ్యప్రదేశ్‌లు బీజేపీకి అత్యధిక స్థానాలందించి మెజారిటీ సాధించడానికి తోడ్పడ్డాయి. లోక్‌సభతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే మిత్రపక్షం టీడీపీ, సిక్కింలో ఎస్‌డీఎఫ్, ఒడిశాలో బిజూ జనతాదళ్ విజయం సాధిం చగా, అరుణాచల్ ప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్ అధికారాన్ని నిలుపుకుంది. అనంతరం జరిగిన మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ హవా కొనసాగింది. హరియాణాలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. మహారాష్ట్రలో మాత్రం శివసేనతో జట్టుకట్టింది. డిసెంబర్‌లో జమ్మూకశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జార్ఖండ్‌లో మోదీ అభివృద్ధి మంత్రం పనిచేసి తొలిసారి మెజారిటీ సీట్లు సాధించగా.. జమ్మూకశ్మీర్‌లో ఆశించిన స్థాయిలో సీట్లు గెలవలేకపోయినా, అత్యధిక ఓట్ల శాతం మాత్రం సాధించింది. కానీ, బిహార్ ఉప ఎన్నికల్లో  బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.

 పీఎంగా మోదీ: ప్రజలు పెట్టుకున్న భారీ అంచనాలు, ఆశల మధ్య ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. పాలనలోనూ తనదైన ముద్ర వేస్తూ మేక్ ఇన్ ఇండియా, జనధన యోజన, స్వచ్ఛభారత్.. తదితర పథకాలను ప్రారంభించారు. గత ప్రధానికి భిన్నంగా తరచుగా ప్రజల్లోకి వెళ్లూ క్రియాశీలక ప్రధానిగా పేరుతెచ్చుకున్నారు. మరోపక్క చాపకింద నీరులా హిందుత్వ ఎజెండాను అమలు చేస్తున్నారని, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నియంతృత్వ పోకడలను ప్రదర్శిస్తున్నారని మోదీపై ఆరోపణలు ప్రారంభమయ్యాయి.  హిందుత్వ సంస్థల బలవంతపు మత మార్పిళ్లు మోదీని ఇరకాటంలోకి నెట్టాయి. నల్లధనాన్ని 100 రోజుల్లో తిరిగి తెస్తానని, యువతకు ఉపాధి కల్పిస్తానని చేసిన ఎన్నికల హామీల అమలు విషయంలో ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొన్నారు.

Advertisement
Advertisement