అమూల్యమైన బహుమతి | Sakshi
Sakshi News home page

అమూల్యమైన బహుమతి

Published Fri, Apr 29 2016 1:49 AM

అమూల్యమైన బహుమతి - Sakshi

పీఎస్‌ఎల్‌వీ సక్సెస్‌పై ప్రధాని హర్షం.. నావిక్‌గా నామకరణం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): పీఎస్‌ఎల్‌వీ సీ33 ప్రయోగం విజయవంతమవడంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తంచేశారు. ఈ ప్రయోగంతో అందుబాటులోకి రానున్న కొత్త నావిగేషన్ వ్యవస్థకు ‘నావిక్’(నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్)గా నామకరణం చేస్తూ జాతికి అంకితం చేశారు. దేశంలోని 125 కోట్ల మందికి అమూల్యమైన బహుమతి ఇచ్చారని, దేశ త్రివర్ణ పతాకాన్ని వినువీధిలో రెపరెపలాడించారంటూ ఇస్రో శాస్త్రవేత్తలను పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రయోగాన్ని ఒక యజ్ఞంలా చేపట్టి విజయవంతం చేశారని అభినందించారు. ఇస్రో ప్రయోగాల్లో ఇది చరిత్రాత్మకమైన ఘట్టమని అభివర్ణించారు.

గురువారం షార్  నుంచి చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ33 ప్రయోగాన్ని ప్రధాని ఢిల్లీ నుంచి వీక్షించారు. వాస్తవానికి ప్రయోగాన్ని స్వయంగా వీక్షించి, నావిగేషన్ సిస్టంను జాతికి అంకితం చేయడానికి ప్రధాని వస్తారని ప్రచారం జరిగింది. అయితే రావడం కుదరకపోవడంతో ఢిల్లీ నుంచే ఇస్రో శాస్త్రవేత్తలనుద్దేశించి మాట్లాడారు. ఉపగ్రహ ప్రయోగాలతో దేశవ్యాప్తంగా సాంకేతిక విప్లవం వచ్చిందని, వాటి ఫలితాలు సామాన్యుడికి సైతం అందుతున్నాయని పేర్కొన్నారు. మరో రెండు మూడు నెలల్లో ప్రతి ఒక్కరి చేతిలో నావిగేషన్ సిస్టం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. సాంకేతిక ఫలితాలు పేదా ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అందజేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతోందని, అందుకే ఈ నావిగేషన్ వ్యవస్థను జాతికి అంకితం చేస్తున్నామని చెప్పారు.

ప్రపంచంలో ఇప్పటి వరకు ఐదు దేశాలకు మాత్రమే వివిధ రకాల పేర్లతో నావిగేషన్ సిస్టం ఉందని, పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వ్యవస్థను అభివృద్ధి చేసుకున్న ఆరో దేశంగా భారత్ ఆవిర్భవించిందని అన్నారు. నావిగేషన్ సిస్టం టెక్నాలజీని నేడు సముద్రంలో చేపలు పట్టుకునే మత్స్యకారుల నుంచి విమానాలు, నౌకలు నడిపే పైలట్లు, కెప్టెన్ల వరకు వినియోగించుకుంటున్నారని చెప్పారు. ఈ టెక్నాలజీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి విపత్తులు, ప్రమాదాలు జరిగినా వెంటనే గుర్తించి సమాచారం అందిస్తుందన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement