అధికారమిస్తే పన్ను సంస్కరణలు | Sakshi
Sakshi News home page

అధికారమిస్తే పన్ను సంస్కరణలు

Published Mon, Jan 6 2014 3:11 AM

అధికారమిస్తే పన్ను సంస్కరణలు - Sakshi

 బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ హామీ   ప్రస్తుత విధానం భారం   కొత్త పన్నుల విధానం అవసరం
 సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రస్తుత పన్నుల విధానాన్ని సమీక్షించి సంస్కరిస్తానని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ప్రస్తుత పన్నుల విధానం సామాన్యులపై భారం మోపుతోందన్నారు. దీన్ని సంస్కరించి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇది చాలా అవసరమన్నారు. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత యూపీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు ఆర్థిక విధానాల ఫలితంగానే దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని మోడీ ఆరోపించారు. అంతకుముందు రాందేవ్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలోని ప్రస్తుత పన్నులన్నింటినీ రద్దు చేసి వాటి స్థానంలో లావాదేవీ పన్ను (ట్రాన్సాక్షన్ ట్యాక్స్) అనే ఏక పన్ను విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనాన్ని జాతీయ సంపదగా ప్రకటించి వెనక్కి తెప్పించాలని మోడీ, బీజేపీని కోరారు. లోక్‌సభ ఎన్నికలకు ‘విజన్ డాక్యుమెంట్’ రూపకల్పనలో ఉన్న బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ నేతృత్వంలోని బృందం ప్రస్తుత పన్నుల విధానం రద్దు అంశాన్ని ఇప్పటికే పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. సమావేశంలో బీజేపీ నాయకుడు అరుణ్ జైట్లీ తదితరులు పాల్గొన్నారు. కాగా, మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ కోట వద్ద జరిగిన కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజు సూరత్‌ను లూటీ చేశారనడం ఆయన్ను కించపరచడమేనన్నారు.
 మోడీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
     ఎన్నికలంటే రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు పోటీ పడతారు. కానీ త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికలే ప్రజాఉద్యమంగా మారనుంది. పార్టీలన్నీ అభివృద్ధి నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసేలా ఈ ఉద్యమం ఒత్తిడి తేనుంది.
     నిరాశ అనేది నా డిక్షనరీలోనే లేదు. నన్ను పెంచేందుకు మా అమ్మ ఇళ్లలో పనులు చేసేది. ఆమెలో ఎప్పుడూ నిరాశ చూడలేదు.
     నాపై కొందరు పసలేని ఆరోపణలు చేసినప్పుడు టీ అమ్ముకుని పెరిగిన నన్ను వారు ఎంత పైకి తెచ్చారో అని అనుకుంటుంటా.
     దుర్భర పేదరికంలో బతికిన వ్యక్తికి ప్రజల కష్టాలు అర్థం చేసుకునేందుకు యాత్రలు చేయాల్సిన అవసరం లేదు. (పరోక్షంగా రాహుల్‌గాంధీని ఉద్దేశించి)
 

Advertisement
Advertisement