మో‘ఢీ’కి సిద్ధంగానే ఉన్నాం! | Sakshi
Sakshi News home page

మో‘ఢీ’కి సిద్ధంగానే ఉన్నాం!

Published Sun, Aug 24 2014 3:31 AM

మో‘ఢీ’కి సిద్ధంగానే ఉన్నాం!

* కాశ్మీర్ అంశంపై మోడీ కఠిన వైఖరి అవలంబించాలనుకుంటున్నారు
* మేమూ సిద్ధంగానే ఉన్నాం.. ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం
* జేకేఎల్‌ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు

 
న్యూఢిల్లీ: కాశ్మీర్ సమస్యకు సంబంధించి ప్రధానమంత్రి మోడీ కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయించుకున్నారని.. అయితే, అందుకు తాము సిద్ధంగానే ఉన్నామని జమ్మూ, కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్‌ఎఫ్) అధినేత యాసిన్ మాలిక్ శనివారం స్పష్టం చేశారు. ‘భారతదేశ ప్రజలు మోడీని ప్రధానిగా ఎన్నుకున్నారు. ఆయన ఇప్పుడు కఠినంగా, మొండిగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. కాశ్మీరీలమైన మేం అందుకు సిద్ధంగానే ఉన్నాం. మా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం.
 
 మోడీ వచ్చాడు.. మాకిప్పుడు పరీక్షా కాలం.. కష్టమైన రోజులు. అయినా, దేవుడి దయతో ఈ పరీక్షలో పాస్ అవుతాం’ అన్నారు. మోడీకి మేమిచ్చే సందేశం ఒకటే.. మీరు సుపరిపాలన ఇస్తారు కావచ్చు.. కానీ కఠిన వైఖరి అవలంబించి ఒక ఉద్యమాన్ని అంతం చేయలేరు’ అని స్పష్టం చేశారు. హిందీ వార్తాచానల్ ఇండియా టీవీలో రజత్ శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించే టీవీ షో ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో యాసిన్ మాలిక్ పాల్గొన్నారు. తమ వల్లనే భారత్, పాక్‌ల మధ్య విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలు రద్దు అయ్యాయన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు.

అన్ని సంబంధిత వర్గాలు చర్చల్లో పాల్గొనాలని తాము కోరుకుంటున్నామన్నారు. పాక్‌తో చర్చల సందర్భంగా శాంతిపూర్వక వాతావరణం ఏర్పడటం కోసం కాశ్మీర్ వేర్పాటువాద నేతలు పాకిస్థాన్ వెళ్లేందుకు 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి అనుమతించిన విషయాన్ని మాలిక్ గుర్తు చేశారు. భారత్, పాకిస్థాన్‌లు మాత్రమే కూర్చుని చర్చలు జరపడానికి కాశ్మీర్ అంశం అనేది సరిహద్దు సమస్య కాదని మాలిక్ తేల్చి చెప్పారు. కాశ్మీర్ భవిష్యత్తును నిర్ణయించే ఏ చర్చల్లోనైనా కాశ్మీరీలను భాగస్వాములను చేయాలని డిమాండ్ చేశారు.
 
 మిలిటెంట్ల వద్దకు వెళ్లాలని మన్మోహన్ కోరారు

 పాకిస్థాన్‌లోని మిలిటెంట్లతో సంప్రదించాల్సిందిగా 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ తనను కోరారని మాలిక్ చెప్పారు.  పాక్‌తో శాంతి ప్రక్రియ ఫలప్రదమయ్యేందుకు అది తోడ్పడుతుందని మన్మోహన్ భావించారన్నారు. మన్మోహన్ సింగ్‌తో సమావేశమైనప్పుడు శాంతి చర్చల్లో తమనూ భాగస్వాము లను చేయాలని తాను కోరిన సందర్భంలో ఆయన పై విధంగా స్పందించారని ఆయన వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement