సార్క్ దేశాధినేతలతో మోడీ చర్చలు | Sakshi
Sakshi News home page

సార్క్ దేశాధినేతలతో మోడీ చర్చలు

Published Wed, May 28 2014 4:07 AM

సార్క్ దేశాధినేతలతో మోడీ చర్చలు - Sakshi

అఫ్ఘాన్ అధ్యక్షుడితో తొలి భేటీ
ఆ దేశ పునర్నిర్మాణం, ఉగ్రవాదంపై చర్చ

 
 న్యూఢిల్లీ: ప్రధానిగా నరేంద్ర మోడీ మంగళవారం బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి ద్వైపాక్షిక చర్చలను అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌తో జరిపారు. తన ప్రమాణస్వీకారానికి హాజరైన అంతర్జాతీయ నేతలతో చర్చల్లో భాగంగా ఇక్కడి హైదరాబాద్ హౌజ్‌లో కర్జాయ్‌తో మోడీ అరగంట పాటు భేటీ అయ్యారు. అఫ్ఘాన్ నుంచి నాటో దళాల ఉపసంహరణ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సహకారం పెంపొందించుకోవడంపైనే ప్రధానంగా చర్చించారు.
 
 అలాగే హెరాత్‌లోని భారత రాయబార కార్యాలయంపై ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడి అంశం కూడా చర్చకు వచ్చింది. అది నిషేధిత లష్కరే తోయిబా సంస్థ పనేనని కర్జాయ్ వెల్లడించినట్లు సమాచారం. అయితే దాడిని ఎదుర్కొనడంలో అఫ్ఘాన్ దళాలు సహకరించినందుకు కర్జాయ్‌కి మోడీ కృతజ్ఞతలు తెలిపారు. అఫ్ఘాన్ పునర్నిర్మాణం, అభివృద్ధికి భారత్ పాటుపడుతుందని మోడీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
 
 ఆ తర్వాత మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ అబ్దుల్ గయూం, శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స, బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ షిరిన్ శర్మిన్‌తోనూ మోడీ భేటీ అయ్యారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి, పలు రంగాల్లో సహకారానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరిగాయి.‘ప్రతి సమావేశంలోనూ సార్క్ స్వరూపం, దాన్ని ఎలా వినియోగించుకోవాలన్న దానిపైనే మోడీ మాట్లాడారు. సార్క్‌లోని ప్రతి సభ్య దేశానికీ తనదైన ప్రత్యేక బలాలు, అవకాశాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను ఒకరి నుంచి మరొకరు నేర్చుకోవాలని మోడీ సూచించారు’ అని సుజాతా సింగ్ పేర్కొన్నారు. ఇందుకు సార్క్ దేశాధినేతల నుంచి సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. ప్రమాణ స్వీకారానికి హాజరైనందుకు విదేశీ అతిథులందరికీ మోడీ కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement