పాకిస్థాన్ జంకుతోందా? | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ జంకుతోందా?

Published Wed, Sep 21 2016 7:17 PM

పాకిస్థాన్ జంకుతోందా?

ఇస్లామాబాద్: అంతర్జాతీయ సమాజం నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలతో పాకిస్థాన్ ఆత్మరక్షణలో పడిందా ..? ప్రపంచ దేశాలు భారత్‌కే మద్ధతు పలుకుతుండడం పాక్‌కు కంటగింపుగా మారిందా..? అందుకే ఇండియాతో యుద్ధానికి సిద్ధమంటూ రంకెలు వేస్తోందా..? ఉడి ఉగ్ర దాడి అనంతరం భారత్ తమపై దాడి చేయనుందని పాకిస్థాన్ కలవరపడుతోందా?  ప్రస్తుత పరిణామాలు చూస్తే ఔననే అనిపిస్తోంది.

పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ యుద్ధానికి అన్ని విధాలా సిద్ధంగా ఉండాలంటూ ఆ దేశ ఆర్మీ చీఫ్‌ రహీల్ షరీఫ్‌కు సూచించినట్లు సమాచారం. ఉరి ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్‌ అటాక్ చేసే అవకాశముందని నవాజ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆ దాడిని ఎదుర్కొనేందుకు సైన్యాన్ని రెడీగా ఉంచాలని ఆర్మీ చీఫ్‌కు నవాజ్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది.

తాజాగా గిల్గిత్, ఉత్తర కశ్మీర్  ప్రాంతంలో ఉన్న ఛిత్రల్, స్కర్దు ప్రాంతాలకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది. ఇందులో భాగంగానే  తాజాగా విమాన సర్వీసులను రద్ధు చేసినట్టు సమాచారం. సరిహద్దు ప్రాంతంలో ట్రాఫిక్ పై ఆంక్షలు విధించింది. కాగా త్వరలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాలని నవాజ్ షరీఫ్ ప్రయత్నిస్తున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.

Advertisement
Advertisement