అపార్టుమెంట్లకు కొత్త చట్టం | Sakshi
Sakshi News home page

అపార్టుమెంట్లకు కొత్త చట్టం

Published Fri, Jun 27 2014 11:07 PM

అపార్టుమెంట్లకు కొత్త చట్టం - Sakshi

- నగర ఎంపీలకు కేంద్రం హామీ
- కొనుగోలు, బదిలీ మరింత సులువు
- యాజమాన్య హక్కులపై భరోసా
న్యూఢిల్లీ:
అపార్టుమెంట్ల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కొత్త చట్టాన్ని తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీ అపార్టుమెంట్ యాజమాన్య చట్టం 1986కు బదులు కొత్త దానిని ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. రాజధానిలోని అపార్టుమెంట్ల యజమానుల సమస్యలను ఇది తీర్చుతుందని ఢిల్లీ ఎంపీలతో భేటీ అయిన సందర్భంగా ఆయన అన్నారు. అయితే డీడీఏ, సహకార సంఘాల హౌసింగ్ సొసైటీలు తమ పరిధిలోకి రావు కాబట్టి అవి నిర్మించిన అపార్టుమెంట్లకు ఈ చట్టం వర్తించబోదని వివరణ ఇచ్చారు.

ప్రస్తుతం చట్టంలోనూ హౌసింగ్ సొసైటీల అపార్టుమెంట్ల గురించి ప్రస్తావన లేదని, ఈ చట్టాన్ని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే యజమానులు తమ అపార్టుమెంటును సులువుగా అమ్మడం/బదిలీ చేయడం వంటివి చేయవచ్చు. అంతేగాక యజమానికి అపార్టుమెంటుపై సంపూర్ణ హక్కులను కొత్త చట్టం ఇస్తుంది. కొనుగోలు, అమ్మకం ప్రక్రియ మరింత సరళంగా ఉండేలా కొత్త చట్టంలో మార్పులు తెస్తారు.

ప్రస్తుతం చట్టం ప్రకారం అపార్టుమెంటు బా ్లకు యజమానులకు వాటిపై ఆక్రమణ హక్కులు మాత్రమే ఉంటాయి. ఢిలీలో దాదాపు 20 లక్షల మంది అపార్టుమెంటుల్లో నివసిస్తున్నారని అంచనా.  ఢిల్లీలోని సమస్యల పరిష్కారంపై చర్చించి ముందుకుసాగడానికి మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీ ఎంపీలతో శుక్రవారం సమావేశమయ్యారు.

ఢిల్లీ అద్దె నియంత్రణ చట్టం, అనధికార కాలనీలు, ఢిల్లీ మాస్టర్‌ప్లాన్, పచ్చదనం అభివృద్ధి వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి. ఉంసీలే పర్వేశ్ వర్మ, ఉదిత్‌రాజ్, మనోజ్ తివారీ, రమేశ్ బిధూరీ ఇందులో పాల్గొన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారని ఎంపీలు తెలిపారు.   కొత్త ప్రతిపాదనలతో మరోసారి తనతో భేటీ కావాల్సిందిగా ఆయన తమను కోరారని వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement