ఖంగుతిన్న లాలూ! | Sakshi
Sakshi News home page

ఖంగుతిన్న లాలూ!

Published Wed, Jul 26 2017 7:41 PM

ఖంగుతిన్న లాలూ! - Sakshi

పట్నా: ముఖ్యమంత్రి పదవికి నితీశ్‌ కుమార్‌ రాజీనామా చేయడంతో బిహార్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. మహాకూటమి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న నితీశ్‌ సీఎం పదవి నుంచి హఠాత్తుగా తప్పుకోవడంతో రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. తన రాజీనామాతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబానికి నితీశ్‌ ఊహించని షాక్‌ ఇచ్చారన్న వాదనలు విన్పిస్తున్నాయి. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న తన కుమారుడు తేజశ్వి యాదవ్‌ను వెనకేసుకొచ్చిన లాలూకు ఇది మింగుడు పడని పరిణామంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

డిప్యూటీ సీఎం పదవికి తన కుమారుడు రాజీనామా చేయబోడని, నితీశ్‌ను ముఖ్యమంత్రి చేసింది తామేనని లాలూ ప్రకటించిన కొద్ది గంటల్లోనే బిహార్‌ రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. ఈ సాయంత్రం జేడీ(యూ) ఎమ్మెల్యేలతో సమావేశమైన తర్వాత నితీశ్‌ కుమార్‌ నేరుగా గవర్నర్‌ కేసరీనాథ్‌ త్రిపాఠి వద్దకు వెళ్లి రాజీనామా చేశారు. అయితే లాలూ, తేజశ్వితో తనకు విబేధాలు లేవని ఆయన చెప్పడం విశేషం. అవినీత రహిత పాలన అందించేందుకు ప్రయత్నించానని, అలాంటి పరిస్థితుల్లో లేకపోవడంతో సీఎం పదవిని వదులుకున్నానని చెప్పారు. తేజశ్వి రాజీనామా కోరలేదని, వివరణ మాత్రమే అడిగానని వెల్లడించారు. నితీశ్‌ నిర్ణయంతో ఆర్జేడీ, కాంగ్రెస్‌ పార్టీలు ఖంగుతిన్నాయి. గోటితో పోయేదాటికి గొడ్డలి వరకు తెచ్చుకున్నట్టు రెండు పార్టీలు భావిస్తున్నాయి. తేజశ్వి యాదవ్‌తో రాజీనామా చేయించివుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. లాలూ మొండివైఖరితో బిహార్‌లో అధికారం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందని రెండు పార్టీల నేతలు కుమిలిపోతున్నారు.

మరోవైపు ఎన్డీఏ జట్టుకట్టి లాలూ కుటుంబానికి చెక్‌ పెట్టే వ్యూహంతోనే నితీశ్‌ రాజీనామా చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సీబీఐ కేసులతో సతమతమవుతున్న లాలూ ఈ షాక్‌ నుంచి కోలుకోవడం కష్టమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కేంద్రంలో మహాకూటమి ఏర్పాటు దిశగా లాలూ చేస్తున్న ప్రయత్నాలకు ఆరంభంలో గండి పడిందన్న భావన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నితీశ్‌ రాజీనామాపై ఆయన ఎలా స్పందిస్తారో, ఎటువంటి వ్యూహాలు అనుసరిస్తారో చూడాలి.
 

Advertisement
Advertisement