బిహార్లో మద్యనిషేధం చెల్లదు

1 Oct, 2016 03:25 IST|Sakshi
బిహార్లో మద్యనిషేధం చెల్లదు

నోటిఫికేషన్‌ను కొట్టేసిన పట్నా హైకోర్టు
పట్నా: మద్య నిషేధంపై బిహార్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మద్యనిషేధంపై ప్రభుత్వం తీసుకొచ్చిన నోటిఫికేషన్‌ను పట్నా హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. ప్రభుత్వ నిర్ణయం ‘అసంబద్ధం, నిరంకుశం’ అని కోర్టు పేర్కొంది. ఈ చట్టం అమలుకోసం సర్కారు తీసుకొచ్చిన చర్యలు నాగరిక సమాజంలో ఆమోదయోగ్యం కావని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ ఇక్బాల్ అహ్మద్ అన్సారీ,  జస్టిస్ నవనీతి ప్రసాద్ సింగ్‌ల ధర్మాసనం బిహార్ ఎక్సైజ్ సవరణ (2016) చట్టంలోని 19 (4) సెక్షన్ ‘రాజ్యాంగ విరుద్ధం, అమలుకు నోచుకోవటం కష్టం’ అని వెల్లడించింది.

బిహార్ మద్య నియంత్రణ చట్టం 1938 ప్రకారం తక్కువ మొత్తంలో మద్యం తీసుకోవటం వల్ల హానికరం కాదని తెలిపింది. ఏప్రిల్ 5, 2016 నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన బిహార్ సర్కారు.. అంతకుముందే రాష్ట్రంలో మద్యం తయారీదారులపై కఠిన చర్యలకు ఆదేశించింది. ఈ చట్టం ప్రకారం మద్యం సేవించినా, అమ్మినా, నిల్వచేసినా కఠిన శిక్షతోపాటు భారీగా జరిమానా విధిస్తారు. కాగా, ఈ చట్టంపై మద్యం తయారీ సంస్థలు, పలు సంఘాలు మే 20న కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ నేపథ్యంలో సంపూర్ణ మద్య నిషేధ చట్టానికి బిహార్ సర్కారు సవరణలు కూడా చేసింది.

వీటి ప్రకారం జైలు శిక్ష, జరిమానా పెంచారు.  ఇంట్లో మద్యం దొరికితే.. ఇంటి పెద్దకు కఠిన శిక్ష తప్పదు. దీనికి వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభలు ఆమోదించాయి. సవరించిన ఈ చట్టం అక్టోబర్ 2న నోటిఫై కావాల్సి ఉండగా.. శుక్రవారం కోర్టు కొట్టేసింది. అయితే ఉత్తర్వుల కాపీ అందిన తర్వాతే స్పందిస్తామని జేడీయూ వెల్లడించింది. ‘మా ప్రభుత్వం మద్యనిషేధానికి కట్టుబడి ఉంది. అవసరమైన మార్పులు చేసైనా అమలుచేస్తాం’ అని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి తెలిపారు. మరోవైపు, దేశవ్యాప్తంగా మద్యనిషేధం అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ప్రభుత్వాల విధానాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా