Sakshi News home page

మోపెడ్‌పై కూతురు మృతదేహంతో..

Published Tue, Feb 21 2017 7:19 PM

మోపెడ్‌పై కూతురు మృతదేహంతో..

బెంగళూరు: మొన్న ఒడిశా నేడు కర్ణాటక.. రెండు దాదాపు సారూప్యం ఉన్న సంఘటనలే.. ఒడిశాలో చనిపోయిన తన భార్యను భుజాలపై ఎత్తుకెళితే కర్ణాటకలో మాత్రం చనిపోయిన తన కూతురుని ఓ తండ్రి మోపెడ్‌ పై 20 కిలోమీటర్లు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తే చేతిలో చిల్లిగవ్వ కూడా లేని తాము పోలీసుల వ్యవహారాలు భరించలేమని చెప్పారు. తొలుత పోస్టుమార్టం అంటారని, ఆ తర్వాత ఇంకేవో కావాలని చెబుతారని, చివరకు శవాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ కూడా ఇవ్వకుండా తాత్సారం చేసి మొత్తానికి సమస్య వచ్చేలా చేస్తారేమో అనే భయంతోనే ఈ పనిచేశామని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని తుంకూరు జిల్లాలోని ఓ గ్రామంలో తిమ్మప్ప అనే వ్యక్తి ఉన్నాడు. అతడికి రత్నమ్మ అనే కూతురు ఉంది. ఆమె తీవ్ర జ్వరం రావడంతోపాటు శ్వాస తీసుకొనే సమస్య ఏర్పడటంతో సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. అయితే, అక్కడి వైద్యుడు వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలనని చెప్పడమే కాకుండా ఆమెకు కనీస వైద్యం కూడా చేయలేదు. దీంతో అతడి చేతుల్లోనే కన్నకూతురు చనిపోయింది.

కూలీ పనులు చేసుకుంటూ బతికే తిమ్మప్ప అప్పటి కప్పుడు మోపెడ్‌ వాహనంపై 20 కిలోమీటర్ల దూరంలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం వద్ద ఆరా తీయగా తాము గ్రామీణ ప్రాంతాలకు సైతం అంబులెన్స్‌లు వైద్య సౌకర్యాలు ఏర్పాటుచేసినా వైద్యం చేసేందుకు వైద్యులు రావడంలేదని ఇది పెద్ద తలనొప్పిగా మారిందన చెబుతోంది. మరోపక్క, ఈ ఘటనపై సిద్దరామయ్య స్పందిస్తూ నిజానికి వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే రత్నమ్మ చనిపోయిందా అనే అంశంపై దర్యాప్తు చేయించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement