'ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు' | Sakshi
Sakshi News home page

'ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు'

Published Wed, May 4 2016 4:26 PM

'ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు' - Sakshi

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కేంద్రప్రభుత్వం మరోసారి నీళ్లు చల్లింది. ఇప్పట్లో అలాంటి అవకాశం ఏమీ లేదని పార్లమెంటు సాక్షిగా కుండ బద్దలుకొట్టింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రక్రియలో మార్పులు చేసే ప్రతిపాదన ఏమీ లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్ పార్లమెంటులో ఈ అంశంపై అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి అవసరమైన సాయం అందిస్తామని, నీతి ఆయోగ్ సిఫార్సులకు అనుగుణంగా ఆ రాష్ట్రానికి నిధులు ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం రూ. 12,806 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 2014-15లో రూ. 4,403 కోట్లు, 2015-16లో రూ. 2 వేల కోట్లు నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. ద్రవ్యలోటు భర్తీ కింద రూ. 2,803 కోట్లు, వెనకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.700 కోట్లు, రాజధాని నిర్మాణం కోసం రూ. 2,050 కోట్లు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 850 కోట్లు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. అసలు ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలోనే లేదని జయంత్ సిన్హా వ్యాఖ్యానించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement