ప్రత్యేక హోదా లేదు.. అర్థం చేసుకోండి: వెంకయ్య | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా లేదు.. అర్థం చేసుకోండి: వెంకయ్య

Published Thu, Sep 8 2016 5:42 PM

ప్రత్యేక హోదా లేదు.. అర్థం చేసుకోండి: వెంకయ్య - Sakshi

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఏపీ అభివృద్ధి విషయంలో తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. తమపై కాంగ్రెస్ పార్టీకి విమర్శలు చేసే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దూరదృష్టి లేకుండానే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో గురువారం వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు. మొదటి కేబినెట్ భేటీలోనే తెలంగాణలోని ఏడు మండలాలను పోలవరం ప్రాజెక్టుకోసం ఏపీలో కలిపామని చెప్పారు.

ఐదేళ్లలో రెవన్యూలోటు భర్తీ చేస్తామని తెలిపారు. 14వ ఆర్థికసంఘం సిఫార్సు ప్రకారం 42శాతం రాష్ట్రాలకు బదలాయించాలని, ఈ సంఘం సిఫార్సు వల్లే ప్రత్యేక హోదా అనేది లేకుండా పోయిందని వివరించారు. విస్తృత చర్చల తర్వాతే ప్రత్యేక హోదాపై ఓ నిర్ణయానికి వచ్చామని, దీనిపై తాను వ్యక్తిగత అభిప్రాయం చెప్పకూడదని తెలిపారు. తెలుగు ప్రజలు ఈ విషయం అర్థం చేసుకోవాలని అన్నారు. తెలుగు ప్రజలకు పోలవరం జీవనధార అని, గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు గురించి పూర్తిగా చెప్పకపోవడంతో తాను స్వయంగా కొత్త ప్రభుత్వం రాగానే బిల్లులో చేర్చి ప్రత్యేకంగా ఆమోదింపజేయించానని అన్నారు.

నిధుల విషయంలో రాష్ట్రాల మధ్య విభేదాలు ఉండవని తెలిపారు. 34 ఏళ్లలో పూర్తికానీ ప్రాజెక్టు ఏడాదిన్నరలో ఎలా పూర్తవుతుందని, పోలవరానికయ్యే పూర్తి వ్యయం కేంద్రమే బరిస్తుందని, ఈ హామీకి చట్టబద్ధత కల్పిస్తామని తెలిపారు. తమ చిత్తశుద్ధికి పోలవరం తార్కాణమని అన్నారు. జోన్ అంశాన్ని రైల్వే శాఖ అధ్యయనం చేస్తోందని తెలిపారు. తమపై దుష్ప్రచారం చేస్తున్నందుకే ఈ వివరణ ఇస్తున్నానని చెప్పారు.

Advertisement
Advertisement