'కన్హయ్యకు ఆ గొడవతో సంబంధమే లేదు' | Sakshi
Sakshi News home page

'కన్హయ్యకు ఆ గొడవతో సంబంధమే లేదు'

Published Thu, Mar 3 2016 3:42 PM

'కన్హయ్యకు ఆ గొడవతో సంబంధమే లేదు'

న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్యకు జాతి వ్యతిరేక నినాదాలకు ప్రత్యక్ష సంబంధంలేదని ఢిల్లీ ప్రభుత్వం తమ నివేదికలో స్పష్టం చేసింది. ఫిబ్రవరి9న జరిగిన ఘటనపై బుధవారం రాత్రి నివేదిక అందచేశామని ఢిల్లీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సంజయ్ కుమార్ తెలిపారు. ఊమర్ ఖలీద్, మరో విద్యార్థి ఆ రోజు నినాదాలు చేశారా లేదా అన్నదానిపై పూర్తిస్థాయి జరగాల్సి ఉందని పేర్కొన్నారు. లభ్యమైన చాలా వీడియోలలో ఊమర్ ఖలీద్ కనపించాడనీ, కశ్మీర్ అంశంపై, అఫ్జల్ గురు విషయాలలో అతడు మద్ధతిస్తున్నట్లు కనిపించాడని సంజయ్ కుమార్ వెల్లడించారు. మరిన్ని వివరాలతో పాటు ఊమర్ ఖలీద్ జాతి వ్యతిరేఖ వివాదాల కార్యక్రమాలలో పాల్గొన్నాడా, లేదా అన్నది త్వరలో తెలుతుందన్నారు. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కొందరు విద్యార్థులను జేఎన్ యూ వర్సిటీ యాజమాన్యం గుర్తించిందని, పూర్తిస్థాయి దర్యాప్తులో అన్ని విషయాలు బయటికొస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఢిల్లీ హైకోర్టు బుధవారం షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. కన్హయ్యకు ఊరట కల్పిస్తూ జస్టిస్ ప్రతిభారాణితో కూడిన ధర్మాసనం ఆరు నెలల కాలానికి బెయిల్ మంజూరు చేసింది. ఆయన దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనరాదని, కేసు దర్యాప్తునకు సహకరించాలని నిర్దేశించింది. అవసరమైనపుడు అధికారుల ఎదుట ఆయన హాజరుకావాలని, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. విడుదల కోసం  రూ. 10 వేల వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలంది. తాను భారత్‌కు వ్యతిరేకంగా ఎటువంటి నినాదాలూ చేయలేదంటూ కన్హయ్య బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా హైకోర్టు మంజూరు చేసింది. మిగతా ఇద్దరూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement