తీస్తా సెతల్వాద్‌కు చుక్కెదురు | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టులో ఆమెకు చుక్కెదురు

Published Tue, Jul 11 2017 9:30 AM

No relief from SC for Teesta Setalvad in illegal exhumation case

న్యూఢిల్లీ: 2002 గుజరాత్‌ అల్లర్లలో చనిపోయిన వారి మృతదేహాలను అక్రమంగా వెలికితీసిన కేసుకు సంబంధించి సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తీస్తాపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసేందుకు నిరాకరిస్తూ గుజరాత్‌ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

పనమ్‌ నది సమీపంలోని శ్మశానంలో పూడ్చిన మృతదేహాలను అక్రమంగా వెలికితీసిన కేసుకు సంబంధించి తీస్తా సెతల్వాద్‌పై పంచమహల్‌ జిల్లాలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఆ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీన్ని అప్పీల్‌ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ అమితవ రాయ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. తీస్తాపై ట్రయల్‌ కోర్టు ఇప్పటికే చార్జిషీట్‌ దాఖలు చేసిందని, ఈ నేపథ్యంలో తాజాగా ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు వెలువరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

‘మీపై ట్రయల్‌ కోర్టులో చార్జిషీటు దాఖలైంది. మీరు ట్రయల్‌ కోర్టులోనే పిటిషన్‌ ఎందుకు వేయకూడదు’ అని ప్రశ్నించింది. 2011 ఏప్రిల్‌ 3న తనపై దాఖలైన చార్జిషీట్‌ను కొట్టివేయాలని కోరుతూ ట్రయల్‌ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఈ మేరకు తీస్తా దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్పోజ్‌ చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement