రాత్రి పూట టాయ్‌లెట్‌ రాకూడదా! | Sakshi
Sakshi News home page

రాత్రి పూట టాయ్‌లెట్‌ రాకూడదా!

Published Tue, Oct 31 2017 2:49 PM

No toilet after working hours! - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘టాయ్‌లెట్‌ ఏక్‌ ప్రేమ్‌ కథా’ చిత్రంలోని స్ఫూర్తి ఏమిటో దక్షిణ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు అర్థం కాకపోయి ఉండవచ్చు. అందులోని టాయ్‌లెట్‌ ప్రాధాన్యత గురించి, దాని అవసరం 24 గంటలపాటు ఉంటుందన్న విషయమైనా అర్థం కావాలి. అది అర్థమైతే ఢిల్లీలోని అన్ని పబ్లిక్‌ టాయ్‌లెట్లను రాత్రి 9 గంటలకే మూసివేస్తారు. రాత్రి పూటి వాటి అవసరం మనిషికి ఉండదనా, ఉండకూడదనా? అందరు ఒకే వేళల్లో పనిచేసి, అందరూ ఒకే వేళల్లో నిద్రించే పరిస్థితి ఉన్న పల్లెల్లో అది సాధ్యమేమోగానీ 24 గంటలపాటు జీవన చక్రం తిరిగే ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో అదెలా సాధ్యం!

దక్షిణ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన రోజైన అక్టోబర్‌ రెండవ తేదీన తన పరిధిలోని మున్సిపల్‌ ప్రాంతాన్ని బహిరంగ విసర్జన నుంచి విముక్తి పొందిన ప్రాంతంగా ప్రకటించుకుంది. మరి ఆ పరిస్థితి కనిపిస్తుందా! రాత్రిపూట ఏరులై పారుతున్న బహిరంగ మూత్ర విసర్జన తాలూకు ఛాయలు మరుసటి రోజు మిట్ట మధ్యాహ్నం వరకు కూడా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత మరుగుదొడ్లు ప్రాంతాల్లో 700 బహిరంగ మరుగుదొడ్లు కట్టించామని, 500 అడుగులకు ఒకటి చొప్పున 25 మొబైల్‌ మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేశామని మున్సిపల్‌ కార్పొరేషన్‌ గర్వంగా చెప్పుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే వాటిలో ఎక్కువ మరుగు దొడ్లకు సీవరేజి కాల్వలకు కనెక్షన్లు ఇవ్వలేదు. ఇక మొబైల్‌ టాయ్‌లెట్ల విషయం మరింత దారుణంగా ఉంది. వాటిని తీసుకొళ్లి ఓ లోతైన గోతిలో పోస్తున్నారు.

పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలనే సదుద్దేశంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన స్వచ్ఛ భారత్‌ స్కీమ్‌ కింద టాయ్‌లెట్ల నిర్మాణ పథకాన్ని తీసుకొస్తే కార్పొరేషన్‌ మరుగుదొడ్లతో పరిసర ప్రాంతాలను చెడగొడ్తున్నారు. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా రాత్రి 9 గంటలకే మరుగుదొడ్లను మూసివేస్తే ఎలా అని మున్సిపల్‌ అధికారులను ప్రశ్నించగా, శానిటేషన్‌ సర్వీస్‌ను కాంట్రాక్టుకు తీసుకున్న బీవీజీ కంపెనీ రాత్రిపూట సర్వీసుకు ముందుకు రావడం లేదని చెప్పారు. ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు రెండు షిప్టుల్లోనే కార్మికులను పంపిస్తున్నారని, రాత్రి షిప్టుకు పంపించడం లేదని చెప్పారు. రాత్రిపూట అల్లరి మూకలు తాగి గొడవ చేస్తాయన్న కారణంగా వీటిని మూసి ఉంచుతున్నట్లు తెలిపారు. ఇదంతా నిజమే కావచ్చు. పోలీసు భద్రతను తీసుకొనైనా వీటి సర్వీసులను కొనసాగించడం అధికారుల విధి. రాత్రి పూట కూడా శానిటేషన్‌ సర్వీసులను అందించే కంపెనీలకు కాంట్రాక్టు ఇవ్వడం కూడా వారి బాధ్యత.

ఎక్కువ వరకు ఈ ప్రభుత్వ మరుగుదొడ్లు మురికి వాడల్లో ఉన్నాయి. రాత్రి పూట వీటి బాధ్యతను స్వీకరించేందుకు స్థానిక యువకులు ముందుకువస్తే వారికి అప్పగిస్తామని మున్సిపల్‌ అధికారులు అంటున్నారు. అసలే మురికి వాడల్లో బతికే బడుగు జీవులు. స్వచ్ఛంద సేవకు ముందుకు రమ్మంటే ఎలా వస్తారు. వారికి నెలసరి జీతం కింద ఉపాధి కల్పిస్తే తప్పకుండా ముందుకు వస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement