ఇంకా రైలెక్కలేదు.. | Sakshi
Sakshi News home page

ఇంకా రైలెక్కలేదు..

Published Fri, Feb 27 2015 1:39 AM

ఇంకా రైలెక్కలేదు..

న్యూఢిల్లీ: జపాన్, చైనాల్లో విమానాలతో పోటీ పడుతూ బుల్లెట్ రైళ్లు దూసుకెళుతున్నాయి.. భారత్ వంటి దేశాల్లో లోపలా, బయటా కిక్కిరిసిన జనాలతో రైళ్లు పరుగులు తీస్తున్నాయి.. మరోవైపు ఇప్పటికీ ప్రపంచంలోని చాలా దేశాల్లో రైళ్లే లేవు. ప్రత్యక్షంగా రైలును చూడని, ఎక్కని జనం కోట్లలో ఉన్నారు మరి. ప్రస్తుతం దాదాపు 25 దేశాల్లో అసలు రైళ్లే లేవు. మన పొరుగునే ఉన్న భూటాన్ నుంచి సైప్రస్, ఉత్తర తిమోర్, కువైట్, లిబియా, మకావూ, మాల్టా, నైగర్, ఓమన్, పపువా న్యూగినియా, ఖతార్, రువాండా, సాన్ మారినో, సోలోమన్ ఐలాండ్స్, సోమాలియా, టోంగా, ట్రినిడాడ్, యెమెన్, బహమాస్, బురుండి, బహ్రెయిన్ వంటి దేశాల్లో రైళ్లే లేవు. వీటిలో కొన్నింటిలో బ్రిటిష్ పాలనా కాలంలో రైళ్లు తిరిగినా.. ఇప్పుడు మూలనపడ్డాయి.
 
 మరి కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే రైలు మార్గాలను నిర్మించుకుంటున్నాయి. ఇక ప్రపంచంలోనే అతి తక్కువగా మొనాకోలో కేవలం 1.7 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గం ఉంది. అలాగే లావోస్‌లో 3.5 కిలోమీటర్లు, నౌరూలో 3.9, లీచెన్‌స్టైన్‌లో 9.5, బ్రూనైలో 13, పరాగ్వేలో 38, సెయింట్ కిట్స్‌లో 58, మన పొరుగునే ఉన్న నేపాల్‌లో 59 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాలు మాత్రమే ఉన్నాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా కేవలం 1,000 కిలోమీటర్లకన్నా తక్కువగా రైలు మార్గాలున్న దేశాల సంఖ్య ఏకంగా 64 కావడం కొసమెరుపు.
 
 రైల్వే ట్రాక్‌నూ ఎత్తాల్సిందే..
 అంతటా రైలొస్తే గేట్లు వేస్తారు... ఇక్కడ మాత్రం పడవలొస్తే రైలు పట్టాలనే ఎత్తేస్తారు.. వెళ్లిపోయాక మళ్లీ దించేస్తారు.. ఆశ్చర్యపోతున్నారా? మన దేశ దక్షిణ దిశన చిట్టచివర ఉన్న రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో కలుపుతూ సముద్రంపై ఈ రైల్వే వంతెన ఉంది. రెండు కిలోమీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జికి ఎటు చూసినా సముద్రం.. మధ్యలో మన రైలు.. కిటికీలోంచి చూద్దామన్నా గుండెలు గుభేలుమనడం ఖాయం. 1902లో రూ. 70 లక్షలతో 600 మందితో ఈ వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు. మధ్యలో పాక్ జలసంధిపై రెండు వైపులా ఎత్తగలిగే 65.2 మీటర్ల పొడవున ‘కాంటిలివర్’ బ్రిడ్జినీ నిర్మించారు. ఎప్పుడో వందేళ్ల కింద 1914లో రైళ్లు నడవడం మొదలుపెట్టినా... ఇప్పటికీ వంతెన దృఢంగా ఉంది. 1964లో వచ్చిన భారీ తుపానును ఇది తట్టుకుని నిలవడం అప్పటి ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనం.

Advertisement

తప్పక చదవండి

Advertisement