క్లాసులకు రాకుంటే రేప్ చేయిస్తారట! | Sakshi
Sakshi News home page

క్లాసులకు రాకుంటే రేప్ చేయిస్తారట!

Published Fri, Apr 8 2016 9:40 AM

క్లాసులకు రాకుంటే రేప్ చేయిస్తారట!

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ ఎన్‌ఐటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. 2000 మంది స్థానికేతర విద్యార్థులు తరగతులను బహిష్కరించి చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు శుక్రవారంతో ఎనిమిదో రోజుకు చేరింది. తమకు క్యాంపస్‌లో సురక్షితమైన వాతారణం లేదని, జమ్మూ-కశ్మీర్ కాకుండా వర్సిటీని మరోచోరుకు మార్చాలని స్థానికేతర విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

తరగతులకు హాజరు కాకుండా ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటే....స్థానికులతో రేప్ చేయిస్తామని  కశ్మీర్‌కు చెందిన సహ విద్యార్థినులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అని బిహార్‌కు చెందిన ఓ విద్యార్థిని వాపోయింది. హాస్టల్‌లోనే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా అభద్రతాభావం ఎక్కువగా ఉందని తెలిపింది.

తాము స్థానిక విద్యార్థులకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని, తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని స్థానికేతర విద్యార్థులు స్పష్టం చేశారు. పరిస్థితులు సద్దుమణిగినట్లు అధికారులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. కేవలం పది శాతం విద్యార్థులు తరగతులకు హాజరై, మిగతా 90% మంది తరగతులు బాయ్‌కాట్ చేస్తే సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లా అని వారు ప్రశ్నించారు.

కాగా స్థానికేతర విద్యార్థులు పోలీసులపై రాళ్లు విసిరిన వీడియో క్లిప్పింగ్‌ను పోలీసులు విడుదల చేశారు. ఈనెల 11 నుంచి పరీక్షలు యథాతథంగా జరుగుతాయని, అయితే ఇప్పుడు పరీక్షలు రాయని విద్యార్థులు అనంతరం రాయవచ్చని కేంద్ర బృందం తెలిపింది. క్యాంపస్‌లో గత శుక్రవారం, మంగళవారం జరిగిన ఘర్షణలపై పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు.

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన తర్వాత కొంతమంది స్థానిక విద్యార్థులు క్యాంపస్‌లో టపాసులు పేల్చి సంబరాలు చేసుకోగా, స్థానికేతర విద్యార్థులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement