నిర్భయ చివరి కోరిక వారిని ఉరి తీయడం కాదు.. | Sakshi
Sakshi News home page

నిర్భయ చివరి కోరిక వారిని ఉరి తీయడం కాదు..

Published Sat, May 6 2017 4:47 PM

నిర్భయ చివరి కోరిక వారిని ఉరి తీయడం కాదు.. - Sakshi

న్యూఢిల్లీ: ‘వారిని కేవలం ఉరి తీయడం కాదు.. బతికుండగానే మంటల్లో తగులబెట్టాలి’  ఈ మాటలు చివరిసారిగా నిర్భయ చెప్పినవి. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులను కింది స్థాయి కోర్టు దోషులుగా తేల్చడమే కాకుండా ఉరి శిక్ష విధించగా ఆ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తూ వారికి ఉరే సరి అంటూ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి నిర్భయ కేసు తాలుకూ విషయాలు పలుచోట్ల చర్చకు వస్తున్నాయి. అందులో భాగంగా తనపై పాశవిక లైంగిక దాడి జరిగి తొలి సర్జరీకి వెళ్లే సమయంలో అసహన స్థితిలో, అచేతనంగా పడి ఉన్న నిర్భయ చివరగా చెప్పిన మాటలను నమోదుచేసుకున్న సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ ఉషా చతుర్వేది గుర్తు చేసుకున్నారు.

‘దోషులను ఉరి తీయబోతున్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా సంతృప్తిగా ఉంది. ఎంతో బాధతో, తీవ్ర ఒత్తిడితో నిర్భయ తన చివరి వాంగ్మూలాన్ని సైగల ద్వారా, చిన్నచిన్న పదాల ద్వారా నాకు చెప్పింది. వారిని ఉరి తీస్తేనే సరిపోదు.. బతికుండగానే మంటల్లో తగులబెట్టాలని తన ఆర్తిని తెలియజేసింది. అంత బాధలో కూడా కోపాన్ని, తన ఏహ్యభావాన్ని చూపించింది. ఆ రోజు డిసెంబర్‌ 21. తన తొలి సర్జరీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాలుగు పేజీల మరణ వాంగ్మూలాన్ని ఇచ్చింది. ఆ సమయంలో ఎంతో బాధతో ఏడ్చేసింది’ అంటూ ఆమె మరోసారి నిర్భయను తలుచుకున్నారు.

Advertisement
Advertisement