Sakshi News home page

కర్ణన్‌తో పాటు మరికొందరు

Published Mon, Jun 19 2017 1:36 AM

కర్ణన్‌తో పాటు మరికొందరు

వివాదాలకు కేంద్రంగా పలువురు న్యాయమూర్తుల వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారతదేశ న్యాయవ్యవస్థలో జస్టిస్‌ కర్ణన్‌ ఒక వివాదాస్పద అధ్యాయం.. జైలు శిక్ష ఎదుర్కొన్న తొలి న్యాయమూర్తిగా, అజ్ఞాతంలో ఉండి పదవీ విమరణ చేసిన న్యాయమూర్తిగా దేశ న్యాయచరిత్రలో నిలిచిపోయారు.  కర్ణనే కాకుండాగతంలోనూ పలువురు న్యాయమూర్తులు తమ తీర్పుల సందర్భంగా వివాదా స్పద వ్యాఖ్యలు చేసిన ఘటనలున్నాయి. వాటిని ఒకసారి పరిశీలిస్తే..

రాజస్తాన్‌ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న మహేశ్‌ చంద్ర శర్మ పదవీ విరమణకు ముందు ఈ ఏడాది మే 31న ఒక తీర్పు సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నెమలి బ్రహ్మచారి కావడం వల్లే జాతీయపక్షిగా ప్రకటించారని, ఆవు కూడా అంతే పవిత్రమని అందువల్ల జాతీయ జంతువుగా చేయాలని కోరారు. ‘మగ నెమలి బ్రహ్మచారిగా ఉంటుంది. ఆడ నెమలితో శృంగారం జరపదు. మగ నెమలి కన్నీళ్లు తాగడం ద్వారా ఆడ నెమలి గర్భం దాలుస్తుంద’న్న వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి.

జస్టిస్‌ జ్ఞాన సుధా మిశ్రా: న్యాయమూర్తుల ఆస్తుల ప్రకటన సందర్భంగా సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ సుధా మిశ్రా   సుప్రీం వెబ్‌సైట్‌లో ఆస్తుల వివరాలు పేర్కొంటూ.. వివాహం కాని తన కుమార్తెల్ని అప్పుగా ప్రస్తావించారు.

జస్టిస్‌ భక్తవత్సల: 2012లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో  వేధింపులకు పాల్పడుతున్న భర్త నుంచి విడాకులు కోరిన మహిళతో.. ‘పెళ్లి చేసుకుని అందరూ మహిళలు బాధలుపడుతున్నారు. నీకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు.. అంటే మహిళగా నీవు ఇబ్బంది పడుతున్నావని అర్థం. నీ భర్త మంచి వ్యాపారం చేస్తున్నాడు. అతను నీ బాగోగులు చూస్తాడు. అలాంటప్పుడు అతను కొడుతున్నాడనే విషయం గురించే ఎందుకు మాట్లాడుతున్నావ’ని పేర్కొన్నారు.

జస్టిస్‌ మార్కండేయ కట్జూ: పదవిలో ఉండగా ఒక తీర్పు సందర్భంగా ‘కొందరు అవినీతిపరుల్ని బహిరంగంగా ఉరితీస్తే.. మిగతావారు అవినీతికి పాల్పడకుండా ఉంటార’ని వివాదా స్పద వ్యాఖ్యలు చేశారు. మరో కేసులో ‘ముస్లిం విద్యార్థుల్ని గడ్డం పెంచుకునేందుకు అనుమతిస్తే.. దేశం తాలిబన్ల ప్రాంతంగా తయారవుతుంద’ని పేర్కొన్నారు.

జస్టిస్‌ శ్రీవాత్సవ : అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ శ్రీవాత్సవ భగవద్గీతను జాతీయ ధర్మశాస్త్రంగా ప్రకటించాలని కోరడం విమర్శలకు దారితీసింది.

జస్టిస్‌ పి.దేవదాస్‌: 2015లో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో.. అత్యాచారం కేసులో నేరస్తుడితో రాజీ చేసుకోమని బాధితురాలికి సూచించడం ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించింది. నేరస్తుడికి బెయిల్‌ మంజూరు చేయడంతో పాటు, అతన్ని పెళ్లి చేసుకోవాలని బాధితురాలికి జస్టిస్‌ దేవదాస్‌ సూచించారు.

జస్టిస్‌ జేబీ పర్దివాలా: గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో  ‘ఈ దేశాన్ని నాశనం చేస్తున్న రెండు అంశాలు ఏవంటే.. ఒకటి రిజర్వేషన్, రెండు అవినీత’ని పేర్కొనడం చర్చనీయాంశమైంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement