వేతన పెంపుపై నోటిఫికేషన్ | Sakshi
Sakshi News home page

వేతన పెంపుపై నోటిఫికేషన్

Published Wed, Jul 27 2016 2:15 AM

Notification on pay rise

కేంద్ర ఉద్యోగుల మూల వేతనం 2.57 రెట్లు పెంపు
 
 న్యూఢిల్లీ : ఏడో వేతన సంఘం సిఫార్సు ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల మూల వేతనాన్ని 2.57 రెట్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం నోటిఫై చేసింది. దీనివల్ల కోటి మందికి ప్రయోజనం చేకూరనుంది. ఖజానాపై ఏటా సుమారు రూ. 1.02 లక్షల కోట్ల భారం పడనున్నట్లు గెజిట్ నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం నెలకు రూ. ఏడు వేల నుంచి రూ. 18 వేలకు పెరిగిన సంగతి తెలిసిందే. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇవ్వడానికి ఏడాదిలో జనవరి 1, జూలై 1 తేదీలను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు జూలై 1న మాత్రమే ఇంక్రిమెంట్ ఇస్తోంది.

 వార్షిక ఇంక్రిమెంట్‌కు రెండు తేదీలు
 ఇకపై ఉద్యోగులు అపాయింట్‌మెంట్ తేదీ, పదోన్నతి, పే స్కేలు మార్పులను బట్టి ఈ రెండు తేదీల్లో ఒక తేదీన వార్షిక ఇంక్రిమెంట్ పొందుతారని పేర్కొంది. అయితే అలవెన్సులకు సంబంధించిన సలహాలను మాత్రం ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ పరిశీలనకు పంపింది. 4 నెలల్లో ఈ కమిటీ దీనిపై నివేదిక సమర్పిస్తుంది. టెలికాం, బీమా, సెబీ లాంటి నియంత్రణ (రెగ్యులేటర్) కమిటీల చైర్‌పర్సన్‌లకు నెలకు రూ. 4.5 లక్షల ప్యాకేజీ ఇస్తారు. ఈ కమిటీల సభ్యులు నెలకు రూ. 4 లక్షల ప్యాకేజీ పొందుతారు.

 పనిచేస్తేనే వేతన పెంపు
 ఆశించిన స్థాయిలో పనిచేయని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వార్షిక వేతన పెంపు ఉండదని కేంద్రంతెలిపింది. పదోన్నతి, ఆర్థిక ప్రయోజనాల హెచ్చింపు కోసం ఉద్యోగుల పనితీరును మదింపు చేసే ప్రమాణాలను ‘గుడ్’ నుంచి ‘వెరీ గుడ్’కు పెంచారు. ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుకు ప్రకటన జారీ చేస్తూ ఆర్థిక శాఖ ఈమేరకు పేర్కొంది. ఉద్యోగ పదోన్నతి హామీ(ఎంఏసీపీ) పథకాన్ని ఇప్పటిలాగే 10, 20, 30 ఏళ్లకు అమలుచేస్తారు. తొలి 20 ఏళ్ల కెరీర్‌లో నిర్దేశిత ప్రమాణాలు అందుకోని ఉద్యోగుల వేతన పెంపుదలను నిలిపివేయాలన్న సంఘం సిఫార్సును కేంద్రం ఆమోదించింది. ప్రస్తుతం 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులున్నారు.

Advertisement
Advertisement