వైన్స్‌ మూసివేతపై ఒడిశా మాస్టర్‌ ప్లాన్‌ | Sakshi
Sakshi News home page

వైన్స్‌ మూసివేతపై ఒడిశా మాస్టర్‌ ప్లాన్‌

Published Thu, Apr 13 2017 4:20 PM

Odisha renames highways as urban roads to beat liquor vends ban

భువనేశ్వర్‌: జాతీయరహదారుల పక్కన మద్యం దుకాణాల మూసివేతను తప్పించుకునేందుకు ఒడిశా ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. పట‍్టణాలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, సబ్‌ డివిజన్‌ ప్రధాన కేంద్రాల గుండా వెళ్లే రాష్ట్ర, జాతీయ రహదారులను అర్బన్‌ రోడ్లుగా గుర్తిస్తూ జీవో వెలువరించింది. దీంతో పాటు బ్లాక్‌, మండల కేంద్రాల గుండా వెళ్లే జాతీయ రహదారులను కూడా అర్బన్‌ రోడ్లుగా ప్రకటించింది. దేశ వ్యాప్తంగా రాష్ట్ర, జాతీయ రహదార్ల పక్కన 500 మీటర్ల దూరంలోపు ఉన్న మద్యం దుకాణాలను మూసివేయాలని మార్చి 31వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం విదితమే.
 
దుకాణాలను తొలగిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం విక్రయాలతో వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోతుంది. ఇది దృష్టిలో పెట్టుకునే ఒడిశా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మద్యం దుకాణాల మూసివేతను నివారించేందుకు మహారాష్ట్ర, రాజస్థాన్‌ ప్రభుత్వాలు కూడా రాష్ట్ర రహదారులను నగర రోడ్లుగా గుర్తిస్తూ ఇటీవలే నోటిఫికేషన్లు వెలువరించాయి.

Advertisement
Advertisement