ప్రస్తుతానికి పాత కేబిన్లే గతి | Sakshi
Sakshi News home page

ప్రస్తుతానికి పాత కేబిన్లే గతి

Published Fri, Nov 21 2014 10:30 PM

old cabin to bjp government in maharashtra

సాక్షి, ముంబై: తొలిసారిగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వానికి తమకు నచ్చినరీతిలో మంత్రాయల భవనం, మంత్రుల క్యాబిన్లలో మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఆధునీకరణ పేరిట ప్రభుత్వం ఇప్పటికే రూ.162 కోట్లకుపైగా ఖర్చు చేసింది. అంచనాకు మించి వ్యయం కావడంతో ఈ పనులను చేపట్టిన యూనిటీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. మంత్రాలయ భవనంలో రెండేళ్ల క్రితం అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి విదితమే.

 ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. భవనాన్ని పునర్‌నిర్మించాల్సి ఉన ్నప్పటికీ కేవలం ఆధునీకరణ పనులకే పరిమితం కావాలని గత ప్రజాస్వామ్య కూటమి కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం నిర్ణయిచింది. ఈ పనులకు ఎల్.అండ్ టీ, షాపూర్‌జీ పాలన్‌జీ, యూనిటీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ టెండర్లు వేశాయి. ఎల్ అండ్ టీ రూ.176 కోట్లు, షాపూర్‌జీ పాలన్‌జీ రూ.166 కోట్లు, యూనిటీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ రూ.162 కోట్లమేర టెండర్లు వేశాయి.

అయితే ఈ సంస్థలు ప్రతిపాదించిన టెండర్ మొత్తం ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం దీన్ని రద్దు చేసి టెండర్లను మళ్లీ ఆహ్వానించాలని నిర్ణయించింది. అయితే ఇవే పనులను రూ.139 కోట్లకు చేస్తామంటూ యూనిటీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ముందుకొచ్చింది. దీంతో డీఎఫ్ ప్రభుత్వం 2012, డిసెంబర్‌లో ఈ పనుల బాధ్యతలను అప్పగించింది. ఒప్పందం ప్రకారం ఈ పనులు 10  నెలల్లోగా పూర్తిచేయాల్సి ఉంది. అయితే తరచూ జరుగుతున్న మార్పుల వల్ల సమయానికి పనులు పూర్తికాలేదని, పైగా వ్యయం కూడా రూ.162 కోట్లకు చేరుకుందని యూనిటీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ చైర్మన్ కిశోర్ చెప్పారు.

Advertisement
Advertisement