నా పెన్షన్ వచ్చింది.. సాయం అక్కర్లేదు! | Sakshi
Sakshi News home page

నా పెన్షన్ వచ్చింది.. సాయం అక్కర్లేదు!

Published Sat, Dec 17 2016 9:24 AM

old man, whose photo went viral rejects help, says got his pension

పెద్దనోట్ల రద్దు తర్వాత సామాన్యుడు కష్టాలతో కన్నీళ్లు పెడుతున్నాడంటూ రెండు రోజుల క్రితం ఓ వృద్ధుడి ఫొటో మీడియాలోను, సోషల్ మీడియాలోను వైరల్ అయింది. బ్యాంకు బయట క్యూ నుంచి తనను పక్కకు తోసేశారంటూ అతడు విలపిస్తున్న ఆ ఫొటో ప్రతి ఒక్కరి గుండెను కదిలించింది. దాంతో ఆయనకు సాయం చేస్తామంటూ ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, దేశం కోసం పోరాడిన యోధుడతను. ఎవరి ముందు చేయి చాచాల్సిన అవసరం తనకు లేదని.. తన పెన్షన్ తనకు వచ్చేసిందని గట్టిగా జవాబు చెబుతున్నాడు. నంద లాల్ (78) 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో పోరాడిన సైనికుడు. తనకు ఎవరి సాయం అక్కర్లేదని, ఏ నెలకు ఆ నెల తనకు వచ్చే పెన్షన్‌ను బ్యాంకు అధికారులు సక్రమంగా విత్‌డ్రా చేసుకోనిస్తే చాలని చెబుతున్నాడు.  ఇప్పటికైతే తనకు పెన్షన్ వచ్చేసిందని, అందువల్ల ఏ ఒక్కరి సాయం అవసరం లేదని స్పష్టం చేశాడు. 
 
గుర్‌గ్రామ్‌లోని ఒక బ్యాంకు వద్ద క్యూలైను నుంచి పక్కకు తోసేయడంతో నందలాల్ విలపిస్తున్న ఫొటోను హిందూస్థాన్ టైమ్స్ ఫొటోగ్రాఫర్ తీశారు. దాంతో ఆయన ఫొటో.. ఆ వివరాలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. దాంతో అతడి బంధువులతో సహా బయటి వాళ్లు కూడా చాలామంది అతడికి డబ్బులిచ్చేందుకు క్యూకట్టారు. ఒక మాజీ సైనికుడు కష్టాలు పడుతున్న విషయం తెలిసి తాను వెళ్లానని మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఢిల్లీ హర్యానా విభాగం అధ్యక్షుడు కల్నల్ (రిటైర్డ్) అజిత్ సింగ్ రాణా తెలిపారు. కానీ, ఆయన తన సాయం తీసుకోలేదన్నారు. తన పెన్షన్‌ను తాను ఎందుకు విత్‌డ్రా చేసుకోలేనని నందలాల్ ప్రశ్నించారు. అయితే, ఆ కాలనీలో ఆయన వెళ్లిన స్టేట్ బ్యాంకు మేనేజర్ రఘువీర్ సింగ్ రాణా మాత్రం.. ఇప్పటికే ఆయనకు ఒకసారి రూ. 10 వేలు, మరోసారి రూ. 5వేలు ఇచ్చామని అన్నారు. ఇంకా ఆయనకు సాయం కావాలంటే తప్పక చేస్తామన్నారు. దాదాపు 30 ఏళ్ల క్రితం భార్య చనిపోవడంతో ఒక పాపను దత్తత తీసుకున్నారు. ఆమెకు పెళ్లయి వేరేచోట ఉంటోంది. తమవద్దకు రావాలని తండ్రికి ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాత్రం రావట్లేదని ఆమె తెలిపింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement