ఆ ఇద్దరి నేతలకు ఏమైంది? | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరి నేతలకు ఏమైంది?

Published Fri, Jan 8 2016 4:57 PM

ఆ ఇద్దరి నేతలకు ఏమైంది? - Sakshi

పట్నా:గతేడాది నవంబర్ లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో  సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ ల మహా లౌకిక కూటమి అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 243 స్థానాలకు జరిగిన పోరులో మహా కూటమి 178  సీట్లను కైవసం చేసుకుని తిరుగులేని విజయంతో నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పాటయ్యింది.  అంతవరకూ బాగానే ఉన్నా ఇప్పుడు ఆ ఇద్దరి నేతల మాటల్లో పూర్తి విరుద్ధమైన ప్రకటనలే  ప్రజల్ని ఆలోచనలో పడేస్తున్నాయి.

 

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మింగా పాకిస్తాన్ కు వెళ్లి ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ తో చర్చలు జరపడాన్ని లాలూ తప్పుపట్టారు. మోదీ ప్రధాని కాకముందు ఏమని ప్రకటనలు చేశారో గుర్తుకు లేవా? అంటూ లాలూ ఎద్దేవా చేశారు. అసలు టెర్రరిస్టులు భారత్ లో ని ఎయిర్ బేస్ లోకి రావడానికి కారణం ఎవరు అనేది మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలిసిన కొన్ని రోజులకే ఆ దేశ ఉగ్రవాద ప్రేరిపిత సంస్థల నుంచి భారత్ లో దాడులు జరగడం మోదీ అసమర్థ వైఖరికి నిదర్శమంటూ ఘాటుగా స్పందించారు.

అయితే లాలూ భాగస్వామి అయిన నితీష్ మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటానికి పాకిస్తాన్ తో చర్చలు ఆహ్వానించదగ్గవే అంటూ నితీష్ మరో పల్లవి అందుకున్నారు.  అదో ఉన్నతమైన కార్యక్రమని మోదీని నితీష్ కొనియాడారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడాటానికి మోదీ వేసిన అడుగు ప్రశంసనీయమన్నారు. ఇటీవల భారత్ లో ఉగ్రదాడులు జరిగినా.. త్వరలోనే పరిస్థితుల్లో మార్పు వచ్చి అంతా చక్కపడుతుందని మోదీ పర్యటనను సమర్ధించారు

 

ఆ ఎన్నికల పూర్తయి ఇంకా మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే వారి వైఖరిలో మార్పులు చోటు చేసుకున్నాయా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఆనాటి ఎన్నికల్లో రాష్ట్ర బీజేపీ ప్రచార సారథిగా బాధ్యతలు వేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీపై వీరిద్దరూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నరేంద్ర మోదీ పేరు ఎత్తితేనే అంతెత్తున లేచి పడిన నితీష్- లాలూల ద్వయం ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరు అన్న చందంగా విడివిడిగా ప్రకటనలు చేయడం ఆసక్తికరంగా మారింది.


అప్పుడు సంయుక్త ప్రకటనలతో మోదీని తూర్పారబట్టిన ఈ రాజకీయ ఉద్ధండుల వైఖరిలో మార్పులు చోటు చేసుకున్నాయా? వారి వారి సొంత ఎజెండాలతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారా?  అనేది మాత్రం రాజకీయ విశ్లేషకుల్ని సైతం కచ్చితంగా ఆలోచనలోపడేస్తుంది. ఒకప్పుడు బీజేపీకి సాన్నిహిత్యంగా ఉన్న జేడీయూ మరోసారి అందుకు సానుకూలంగా వ్యవహరించడానికే ముందస్తు పావులు కదుపుతుందా? అనేది మరో కోణంలో కనిపిస్తుంది. ఒకవేళ నితీష్ మనసులో ఏ ఉద్దేశం లేకపోతే  ఆకస్మికంగా మోదీని పొగడ్తలతో ముంచెత్తాల్సిన అవసరం ఏమిటనేది సామాన్యుడి ప్రశ్న.

Advertisement

తప్పక చదవండి

Advertisement