ఇక మన జీపీఎస్ | Sakshi
Sakshi News home page

ఇక మన జీపీఎస్

Published Thu, Jan 21 2016 1:10 AM

ఇక మన జీపీఎస్

పీఎస్‌ఎల్వీ-సీ31 సక్సెస్.. కక్ష్యలోకి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ
 
 బుధవారం ఉదయం 9.31కి ప్రయోగం
 నావిగేషన్ సేవలకు మరింత తోడ్పాటు
 ఈ ఏడాదే ‘జీఎస్‌ఎల్వీ మార్క్-3’ ప్రయోగం: ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్

 
 శ్రీహరికోట (సూళ్లూరుపేట): పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత ఉపఖండంలో క్షేత్రీయ దిక్సూచీ వ్యవస్థ (రీజనల్ నావిగేషన్ సిస్టమ్-ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్) కొద్దిరోజుల్లోనే అందుబాటులోకి రానుంది. ఈ వ్యవస్థలో భాగమైన ఐదో ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో... బుధవారం పీఎస్‌ఎల్వీ-సీ31 రాకెట్ ద్వారా 1,425 కిలోల బరువైన ‘ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ’ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం ద్వారా జీపీఎస్ తరహాలో దేశీయంగా సొంత నావిగేషన్ వ్యవస్థ అయిన ‘ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్)’ మరింత బలోపేతం కానుంది. ప్రయోగం సక్సెస్‌తో ఇస్రో మొత్తంగా 51 విజయాన్ని, పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో 32వ విజయాన్ని నమోదు చేసుకుంది.

 మేఘాలను చీల్చుకుంటూ.. ఈ ప్రయోగానికి సోమవారం 48 గంటల కౌంట్‌డౌన్‌ను ప్రారంభించగా... బుధవారం ఉదయం 9 గంటల 31 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగికెగిసింది. రాకెట్ మేఘాలను చీల్చుకుంటూ ఆకాశమార్గం పట్టగానే షార్‌లో కరతాళ ధ్వనులు మిన్నంటాయి. 44.5 మీటర్ల ఎత్తయిన పీఎస్‌ఎల్వీ రాకెట్ 4 దశలను పూర్తిచేసుకుని.. పెరిజి(భూమికి దగ్గరగా) 284.1 కి.మీ., అపోజి (భూమికి దూరంగా) 20,667 కి.మీ. దూరం ఉండే భూస్థిర బదిలీ కక్ష్య(జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్)లో 19.2 డిగ్రీల వాలులో దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టింది. 19 నిమిషాల 36 సెకన్ల సమయంలో ప్రయోగం పూర్తయింది. ఆ వెంటనే ‘ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ’ ఉపగ్రహానికి ఇరు పక్కలా ఉన్న సోలార్ ప్యానల్స్ విచ్చుకుని, పనిచేశాయి. 

కర్ణాటకలోని హాసన్‌లో ఉన్న ‘మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ’ శాస్త్రవేత్తలు ఉపగ్రహాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నారు. వారం తర్వాత ఉపగ్రహంలోని ద్రవ ఇంధనాన్ని మండించి ‘భూస్థిర బదిలీ కక్ష్య’ నుంచి భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని ‘భూస్థిర కక్ష్య (జియో సింక్రోనస్ ఆర్బిట్)’లో ప్రవేశపెడతారు. ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలు అందించనుంది.

 కొత్త విజయంతో ప్రారంభించాం.. ఉపగ్రహం  కక్ష్యలోకి చేరిందని.. కొత్త సంవత్సరాన్ని ఈ విజయంతో ప్రారంభించామని ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. ‘ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్’లతో భారత ఉపఖండంలో కచ్చితమైన నావిగేషన్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ వ్యవస్థకు సంబంధించి మరో రెండు ఉపగ్రహాలను వచ్చే రెండు నెలల్లో ప్రయోగిస్తామన్నారు. ఇక ఈ ఏడాది భారీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లగలిగే ‘జీఎస్‌ఎల్వీ మార్క్-3’ని ప్రయోగిస్తామన్నారు. అంతరిక్ష రంగంలో సహకారం కోసం కువైట్ అంతరిక్ష సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం వివరాలను అధికారులు సోమవారం కేంద్ర కేబినెట్‌కు అందజేశారు.

 రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు.. తాజా ప్రయోగం నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ ప్రశంసించారు. ‘శాస్త్రవేత్తలకు నా హృదయపూర్వక అభినందనలు. వారు మరో విజయం సాధించారు..’ అని ప్రణబ్ పేర్కొన్నారు. ‘ఇస్రో శాస్త్రవేత్తలు తమ కృషితో దేశాన్ని గర్వపడేలా చేశారు. వారికి నా అభినందనలు..’ అని మోదీ ట్వీట్ చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన విజయం దేశానికే గర్వ కారణమని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు, శాస్త్రవేత్తలందరికీ అభినందనలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తల ప్రతిభతో ఈ విజయం సాధ్యమైందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.

 ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్ అభినందనలు
 సాక్షి, హైదరాబాద్: పీఎస్‌ఎల్వీ-సీప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. అంతరిక్ష రంగంలో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
 
 ఏమిటీ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్..?
 మన దేశ అవసరాల నిమిత్తం భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం)ను రూ.3,425 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం మొత్తం ఏడు ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించగా... ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ, 1బీ, 1సీ, 1డీలతో తాజాగా ‘1ఈ’ ఉపగ్రహంతో కలిపి ఐదింటిని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఈ ఏడాది మార్చి 10, 28 తేదీల్లో మిగతా రెండు ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఈ ‘ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్’ వ్యవస్థ భారతదేశం మొత్తంతో పాటు చుట్టూ మరో 1,500 కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది. ప్రాజెక్ట్ మొత్తం పూర్తయితే జీపీఎస్ తరహాలో భారత్‌కు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో విమానాలు, నౌకలు, రోడ్డు మీద వాహనాలకు దిక్సూచి వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ నెలాఖరుకు స్వదేశీ నావిగేషన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెస్తామని ఇప్పటికే ఇస్రో అధికారులు ప్రకటించారు.

Advertisement
Advertisement