పాక్‌ లో భారత మహిళకు విముక్తి

25 May, 2017 07:48 IST|Sakshi
పాక్‌ లో భారత మహిళకు విముక్తి

న్యూఢిల్లీ: ఎట్టకేలకు భారత మహిళకు పాకిస్థాన్‌లో విముక్తి లభించింది. బలవంతంగా తనను పెళ్లి చేసుకున్న ఓ పాకిస్థాన్‌ వ్యక్తి నుంచి విడిపోయి తిరిగి భారత్‌ వచ్చేందుకు పాక్‌లోని ఇస్లామాబాద్‌ హైకోర్టు అనుమతిచ్చింది. ఈ మేరకు పాక్‌కు చెందిన ఓ టీవీ చానెల్‌ తెలిపింది. ఉజ్మా అనే 20 ఏళ్ల భారతీయ మహిళ గత నెలలో ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు వెళ్లి తనను భారత్‌కు పంపించాలని, తనకు తుపాకీ గురిపెట్టి మరీ తాహిర్‌ అలీ అనే ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడని విజ్ఞప్తి చేసుకుంది. ఆ తర్వాత ఇస్లామాబాద్‌ కోర్టుకు వెళ్లిన ఉజ్మా.. తాహిర్‌ తనను వేధిస్తున్నాడని, బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని తనకు తన దేశం వెళ్లే అనుమతి ఇవ్వాలని కోరింది.

తనకు ప్రాణహానీ కూడా ఉందంటూ అందులో పేర్కొంది. ఆమె పిటిషన్‌ను విచారించిన ఇస్లామాబాద్‌ హైకోర్టు బెంచ్‌ జస్టిస్‌ మోసిన్‌ అక్తర్‌ ఖయానీ ఆమెకు భారత్‌ వెళ్లేందుకు అనుమతిచ్చారు. అయితే, ఉజ్మాను కలిసేందుకు అనుమతివ్వాలంటూ తాహిర్‌ కోరగా తన గదిలో మాత్రమే కలవాలని న్యాయమూర్తి చెప్పారు. అయితే, అతడిని కలిసేందుకు ఉజ్మా నిరాకరించింది. దీంతో ఉజ్మా భారత్‌ వెళ్లేందుకు రక్షణ కల్పించాలని, వాఘా సరిహద్దు దాటి వెళ్లే వరకు భద్రంగా చూడాలని న్యాయమూర్తి పోలీసుశాఖను ఆదేశించారు. ఈ నెల 30కే ఆమె వీసా గడువు ముగియనున్న నేపథ్యంలో త్వరగా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు