చంద్రయాన్‌-2: రాని పనిలో వేలెందుకు పెట్టాలి!? | Sakshi
Sakshi News home page

చంద్రయాన్‌-2: రాని పనిలో వేలెందుకు పెట్టాలి!?

Published Sat, Sep 7 2019 12:45 PM

Pakistan science minister tweets against India moon landing mission - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం చివరిదశలో చేదు ఫలితం ఎదురైన వేళ..  పాకిస్థాన్‌ సైన్స్‌ శాఖ మంత్రి ఫవాద్‌ చౌదరి ట్విటర్‌లో రెచ్చిపోయాడు. భారత్‌కు వ్యతిరేకంగా ఫవాద్‌ నోటిదురుసు వ్యాఖ్యలు చేసి.. విచ్చలవిడితనాన్ని ప్రదర్శించాడు.  

చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ ల్యాండర్‌ పయనం.. అక్కడ కుదుపునకు లోనై.. ల్యాండర్‌ నుంచి ఇస్రో గ్రౌండ్‌ సెంటర్‌కు సిగ్నల్స్‌ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరుస ట్వీట్లు చేసిన ఫవాద్‌ ‘రాని పనిలో వేలు పెట్టొద్దు.. డియర్‌ ఎండియా (Dear “Endia” )’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్‌కు 8,800లకుపైగా కామెంట్లు వచ్చాయి. పలువురు భారత నెటిజన్లు ఫవాద్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘చంద్రాయాన్‌-2లో కితకితలు పెట్టే అంశమేమిటంటే.. అది రాత్రంతా ఫవాద్‌ను మేల్కొనే చేసింది’ అని ఒక నెటిజన్‌ కామెంట్‌ చేశారు. పలువురు పాకిస్థానీ నెటిజన్లు కూడా ఫవాద్‌ తీరును తప్పుబట్టారు. భారత్‌ కనీసం ప్రయత్నమన్నా చేసిందని, అలాంటి ప్రయత్నాన్ని కించపరచడం పాకిస్థాన్‌ పేరును చెడగొట్టడమే అవుతుందని పలువురు నెటిజన్లు సూచించారు.

అయినా, ఫవాద్‌ ఏమాత్రం వెనుకకు తగ్గలేదు. ఆ తర్వాత కూడా ఇస్రోపై, భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ ట్వీట్లు పెట్టారు. చంద్రాయన్‌-2 వైఫల్యానికి తానే కారణమైనట్టు ఇండియన్‌ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారని, చంద్రాయన్‌ బొమ్మ మూన్‌పైన కాకుండా ముంబైలో ల్యాండ్‌ అయిందని ఎద్దేవా వ్యాఖ్యలు చేశారు. మోదీ శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ మీద ప్రసంగాలు చేస్తున్నారని, ఆయన నిజానికి పొలిటిషియన్‌ కాకుండా ఆస్ట్రోనాట్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిరుపేద దేశానికి చెందిన రూ. 900 కోట్లు వృథా చేయడంపై లోక్‌సభలో మోదీని ప్రతిపక్షాలు నిలదీయాలని ఫవాద్‌ అక్కసు వెళ్లగక్కారు. అల్పులు పెద్ద పెద్ద పదవులు అలంకరిస్తున్నారని గత ఏడాది పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలు చేశారని, ఫవాద్‌ తీరు చూస్తే అది నిజమేనని అనిపిస్తోందని నెటిజన్లు చమత్కరిస్తున్నారు.
 

Advertisement
Advertisement