పాక్ మళ్లీ కాల్పులు | Sakshi
Sakshi News home page

పాక్ మళ్లీ కాల్పులు

Published Mon, Oct 17 2016 2:46 AM

పాక్ మళ్లీ కాల్పులు - Sakshi

జమ్మూ: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ సైన్యం జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వెంట జరిపిన కాల్పుల్లో యూపీకి చెందిన  జవాను సుధీశ్ కుమార్(24) ప్రాణాలు కోల్పోయారు. రాజౌరీ జిల్లాలోని తార్కుండీ సరిహద్దు ప్రాం తంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని సీనియర్ సైన్యాధికారి వెల్లడిం చారు. ఆదివారం ఉదయం కూడా నౌశెరా సెక్టార్ వెంట భారత పోస్టులపై పాక్ సైన్యం కాల్పులు జరిపిందని రక్షణ శాఖ అధికారి తెలిపారు.

ఈ దాడులను భారత దళాలు తిప్పికొట్టాయని.. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపారు.  పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం సర్జికల్ దాడుల తర్వాత వాస్తవాధీన రేఖ వెంట పాక్ 25 సార్లకు పైగా కవ్వింపు చర్యలకు పాల్పడిందని సీనియర్ ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పూంచ్ జిల్లాలో పాక్ జరిపిన దాడుల్లో ఐదుగురు పౌరులు, నలుగురు జవా న్లు గాయపడ్డారు. అయితే భారత భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో తొమ్మిది మంది పాక్ జవాన్లు గాయపడినట్లు ఆయన తెలిపారు.

గత నెలరోజుల వ్యవధిలో పాక్ పలుమార్లు కాల్పుల మోత మోగించింది. అక్టోబర్ 8న పూంచ్ జిల్లాలోనే మెంథార్ కృష్ణగాటీ సెక్టార్ గుండా ఉన్న భారత ఆర్మీ చెక్‌పోస్టుపై పాక్ జరిపిన కాల్పుల్లో భారత జవాను ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అక్టోబరు 5న రాజౌరీ, పూంచ్ జిల్లాల్లోని ఎల్వోసీ వద్ద భారత చెక్‌పోస్టులపై పాక్ బలగాలు మోర్టార్ బాంబులతో మూడుసార్లు దాడి చేశాయి. అక్టోబరు 4న రాజౌరీ జిల్లాలోని నౌశెరా సెక్టార్‌లోని మక్రి, కల్షియన్, జాన్‌గర్, జమ్మూలోని పల్లన్‌వాలా సెక్టార్‌లోని పలన్‌వాలా, చన్నీ, దమను, ప్లాటన్, గిగ్రియాల్, పూంచ్‌లోని కృష్ణగాటీ, బాల్నోయిలో పాక్ దళాలు మోర్టార్ బాంబులతో దాడి చేశాయి.

అక్టోబరు 3న పూంచ్‌లోని కేజీ సెక్టార్‌లోని మండీ, షాపూర్‌కె ర్నీ, సౌజియన్‌లలో పాక్ కాల్పులు జరిపింది. అక్టోబరు 2న జమ్మూలోని పల్లన్‌వాలా ప్రాంతాల్లో పలుమార్లు పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. అక్టోబరు 1న జమ్మూలోని పల్లన్‌వాలా సెక్టార్‌లోనూ పాక్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.సెప్టెంబరు 30న పాక్ దళాలు అఖ్నూర్ సెక్టార్‌లోని చప్రియాల్‌లో పాక్ కాల్పులకు తెగబడింది.

Advertisement
Advertisement