పారిపోయిన కేంద్రం; పార్లమెంట్‌ నిరవధిక వాయిదా | Sakshi
Sakshi News home page

పారిపోయిన కేంద్రం; పార్లమెంట్‌ నిరవధిక వాయిదా

Published Fri, Apr 6 2018 11:26 AM

Parliament sine die Without Taking No Confidence Motion - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎలాంటి పరీక్షకైనా సిద్ధమని చెప్పుకున్న ఎన్డీఏ సర్కార్‌.. చివరికి అవిశ్వాసాన్ని ఎదుర్కోకుండా పారిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండానే పార్లమెంట్‌ సమావేశాలు ముగిశాయి. బడ్జెట్‌ సమావేశాల చివరి రోజైన శుక్రవారం లోక్‌ సభ ప్రారంభమైన వెంటనే.. సమావేశాల ముగింపునకు సబంధించి స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కీలక ప్రకటన చేశారు. వెల్‌లో ఆందోళన చేస్తోన్న అన్నాడీఎంకే ఎంపీలు వెనక్కి వెళితే.. అవిశ్వాస తీర్మానం నోటీసులపై మాట్లాడతానన్న స్పీకర్‌.. అనూహ్యంగా సభను నిరవదికంగా వాయిదావేశారు.

అరుపుల మధ్యే జాతీయ గేయం..: రెండు విడదలుగా పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరిగిన తీరు తెన్నులను స్పీకర్‌ వివరిస్తున్న తరుణంలో.. అవిశ్వాసంపై చర్చ చేపట్టాలని విపక్ష ఎంపీలు గట్టిగా నినాదాలు చేశారు. అయినాసరే, స్పీకర్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అరుపుల మధ్యే జాతీయ గేయం వందేమాతరం ప్రారంభంకావడంతో ఎంపీలు మిన్నకుండిపోయారు. ఆ తర్వాత లోక్‌సభను నిరవదికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆఖరి రోజు లోక్‌ సభకు ప్రధాని మోదీ, ఇతర ముఖ్య నేతలంతా హాజరయ్యారు.

స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌: ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలిసి రాజీనామాలు సమర్పించారు. సభ నిరవధిక వాయిదా పడిన అనంతరం స్పీకర్‌ ఛాంబర్‌కు వెళ్లిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు.. స్పీకర్‌ ఫార్మాట్‌లోనే రాజీనామాలు సమర్పించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఏపీ భవన్‌కు వెళ్లి ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభిస్తామని ఎంపీలు చెప్పారు.

Advertisement
Advertisement