బాబా రాందేవ్‌ అడిగితే కాదంటారా? | Sakshi
Sakshi News home page

బాబా రాందేవ్‌ అడిగితే కాదంటారా?

Published Wed, May 3 2017 4:56 PM

బాబా రాందేవ్‌ అడిగితే కాదంటారా? - Sakshi

న్యూఢిల్లీ: యోగా గురువు రాందేవ్‌ బాబాకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, ఆయన ప్రభుత్వానికి ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయో బహిరంగ రహస్యమే. అందుకనే నరేంద్ర మోదీ బుధవారం హరిద్వార్‌లోని పతంజలి ఆశ్రమంలో ఆయుర్వేద రీసెర్చ్‌ సెంటర్‌ను స్వయంగా ప్రారంభించారు. దేశం కోసం రాందేవ్‌ బాబా చేస్తున్న కషిని కూడా ఆయన ప్రశంసించారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేసినందుకు రాందేవ్‌ బాబాకు  మోదీ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ రుణం తీర్చుకుంటోంది. బాబా ప్రాణాలకు అంతగా ముప్పు లేకపోయినప్పటికీ  2014, నవంబర్‌ నెలలో ఆయనకు మోదీ ప్రభుత్వం జెడ్‌ కేటగిరి భద్రతను ఏర్పాటు చేసింది. హరిద్వార్‌లోని ఆయన ఫుడ్‌ పార్క్‌కు, యోగా ఆశ్రమానికి పారా మిలటరీ భద్రతను కల్పించింది. అక్కడ 35 మంది సీఐఎస్‌ఎఫ్‌ సాయుధ సిబ్బందిని ఏర్పాటు చేసింది. ప్రైవేటు రంగానికి అత్యంత అరుదైన పరిస్థితుల్లోనే ఈ సీఐఎస్‌ఎఫ్‌ భద్రతను కల్పిస్తారన్న విషయం తెల్సిందే. బాబాకు కల్పిస్తున్న ఈ భద్రతకుగాను కేంద్ర ప్రభుత్వానికి ఏటా 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది.

పతంజలి ఉత్పత్తులను ప్రమోట్‌ చేయడానికి ఆ సంస్థతో టైఅప్‌ పెట్టుకుంటున్నట్లు 2016, ఆగస్టులో డెఫెన్స్‌ రిసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్డీవో) ప్రకటించింది. దేశంలోని పిల్లల్లో పౌష్టికాహారలోపాన్ని సరిదిద్దేందుకు అవసరమైన మందుల తయారీకి రాందేవ్‌ బాబాతో సంయుక్తంగా ఓ సంస్థను ఏర్పాటు చేస్తామని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జ్వాల్‌ ఓరమ్‌ ప్రకటించారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌవాన్‌ సూచన మేరకు ఆ రాష్ట్రంలోని అన్ని చౌక దుకాణాల్లో పతంజలి ఉత్పత్తులను విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఫ్యాక్టరీలు, హెర్బల్‌ పార్కులు, యూనివర్శిటీలు, స్కూళ్లు, గోశాలలు....ఇలా ఎన్నో ఏర్పాటు చేసేందుకు కేంద్రంలోనూ, పలు రాష్ట్రాల్లో అధికారంలోవున్న బీజేపీ ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. వస్తున్నాయి. పతంజలి యోగా పీఠాన్ని ఏర్పాటు చేసేందుకు అండమాన్‌లో ఏకంగా ఓ దీవినే ఉచితంగా ఇస్తానని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రి నితిన్‌ గడ్కారీ ప్రకటించారు. ఆవు ఉత్పత్తుల అమ్మడం ద్వారా ఇప్పటికీ అధిక లాభాలను ఆర్జిస్తున్న రాందేవ్‌ బాబాకు చెందిన పతంజలి సంస్థ ఎప్పటి నుంచో దీనిపై దష్టిని కేంద్రీకరిస్తోంది. పతంజలి ఉత్పత్తుల్లో ఎక్కువ అమ్ముడుపోతున్న వాటిల్లో ప్రధానమైనది ఆవు నెయ్యి. ఇప్పుడు ఆవు మూత్రంతో తయారు చేసిన ఫినాయ్‌ల్‌ను కూడా అమ్ముతున్నారు.

క్యాన్సర్‌ సహా అన్ని రోగాలను నయం చేసే ఔషధ గుణాలు ఆవు మూత్రంలో ఉన్నాయని ప్రచారం చేసిన రాందేవ్‌ బాబా నెలకు ఐదువేల లీటర్ల ఆవు మూత్రాన్ని సరఫరా చేయాలంటూ 2008లో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. నెలకు మూడు వేల లీటర్ల చొప్పున ఇప్పటి వరకు రెండు లక్షల లీటర్లకుపైగా గో మూత్రాన్ని సేకరించారు. గోధాన్‌ ఆర్క్, సంజీవని వటి, పాంచ్‌గవ్యా సోప్, కాయ్‌కల్ప్‌ ఆయిల్, శుద్ధి ఫినాయిల్‌ ఉత్పత్తుల్లో గో మూత్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఆవుల క్రాస్‌ బ్రీడింగ్‌ను అభివద్ధి చేసేందుకు ఓ రెసెర్చ్‌ సెంటర్‌ను ఉత్తరాఖండ్‌లోనే ఏర్పాటు చేయాలనుకున్న బాబా అక్కడి బీజేపీ ప్రభుత్వంతోని ఉప్పందం కూడా కుదుర్చుకున్నారు. మరెందుకో ఇప్పుడు హరిద్వార్‌లో ఏర్పాటు చేయబోతున్నారు.

బీజేపీ పార్టీతో, ఆ పార్టీ ప్రభుత్వాలతో వున్న సంబంధాలను ఉపయోగించుకొని తన వ్యాపార సామ్రాజ్యాన్ని బాబా రాందేవ్‌  విస్తరించుకుంటూ పోతున్నారనే విమర్శలు ఉన్నాయి. దేశంలో గోరక్షణ ఉద్యమం కూడా ఆయన రహస్య ఉపదేశంతోనే వచ్చిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మూడువేల కోట్ల రూపాయలు దాటిని ఆయన వ్యాపార సామాజ్య్రం పదేళ్లలో లక్ష కోట్ల రూపాయలకు విస్తరిస్తుందని ఓ ఇంటర్వ్యూలో బాబానే చెప్పుకున్నారు.

నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను పాటించలేదని, ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయంటూ ఇప్పటి వరకు పతంజలి సంస్థపై దాదాపు 90 కేసులు దాఖలయ్యాయి. ఓ కేసులో 11 లక్షల జరిమానా కూడా పడింది. బీజేపీ ప్రభుత్వాలు ఇంత బహిరంగంగా సహాయ సహకారాలు అందించడం ఒక్క బాబా విషయంలోనే జరిగిందేమో.

Advertisement
Advertisement