'ప్రజలు చనిపోతుంటే.. మీరు సవాల్ చేస్తున్నారా?' | Sakshi
Sakshi News home page

'ప్రజలు చనిపోతుంటే.. మీరు సవాల్ చేస్తున్నారా?'

Published Thu, Jan 14 2016 11:13 AM

'ప్రజలు చనిపోతుంటే.. మీరు సవాల్ చేస్తున్నారా?' - Sakshi

న్యూఢిల్లీ: 'సరి-బేసి' నంబర్‌ ప్లేట్‌ విధానంపై ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై వెంటనే విచారణ చేపట్టాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను న్యాయస్థానం గురువారం తిరస్కరించింది. 'ఢిల్లీలో ప్రజలు కాలుష్యంతో చనిపోతున్నారు. మేం కారు పూలింగ్ చేస్తున్నాం. దీనిని మీరు సవాల్ చేయాలనుకుంటున్నారా' అని పిటిషనర్‌ను సుప్రీంకోర్టు నిలదీసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌ 'పబ్లిసిటీ స్టంట్‌' మాత్రమేనని పేర్కొంది. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఈ సందర్భంగా కోరారు.

ఢిల్లీలో వాయుకాలుష్యం తగ్గించడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం 'సరి-బేసి' అంకెల విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిద్వారా 'సరి-బేసి' నంబర్‌ప్లేట్ల ఆధారంగా దినం తప్పించి దినం వాహనాలను రోడ్లపై అనుమతించాలని నిర్ణయించింది. ఈ నెల 15 వరకు విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలుకు నోటిఫికేషన్ జారీచేయగా.. ఇందుకు మద్దతుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సైతం తమ వాహనాలను సమీకరించుకొని (కార్ పూలింగ్).. రోజుకు ఒకరి వాహనంలో వెళ్లాలని నిర్ణయించారు. అయితే 'సరి-బేసి' నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ కొందరు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నోటిఫికేషన్ రద్దు చేయడానికి ఢిల్లీ హైకోర్టు తిరస్కరించగా.. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
 

Advertisement
Advertisement