నెత్తురు, నీళ్లు కలసి ప్రవహించలేవు | Sakshi
Sakshi News home page

నెత్తురు, నీళ్లు కలసి ప్రవహించలేవు

Published Tue, Sep 27 2016 3:04 AM

నెత్తురు, నీళ్లు కలసి ప్రవహించలేవు - Sakshi

పాక్‌తో సింధు నీటి ఒప్పందం సమీక్షలో ప్రధాని మోదీ
- పాకిస్తాన్ నియంత్రణలోని నదుల నీటిని గరిష్టంగా
- వాడాలని నిర్ణయం ఒప్పంద అధ్యయనానికి టాస్క్‌ఫోర్స్
 
 న్యూఢిల్లీ: పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న నదుల నీటి ని గరిష్టంగా వినియోగించుకోవాలని భారత్ నిర్ణయించింది. 56 ఏళ్ల నాటి భారత్-పాక్ సింధు జలాల ఒప్పందంపై సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన భేటీలో పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. నెత్తురు, నీళ్లు ఒకేసారి ప్రవహించలేవంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. జలవిద్యుత్ ప్రాజెక్టులు, సాగునీరు, నిల్వ కోసం ఇక నుంచి సింధు, చీనాబ్, జీలం నదుల్లోంచి గరిష్ట స్థాయి నీటిని వినియోగించాలంటూ భేటీలో అవగాహనకు వచ్చారు. ఉడీ ఉగ్రదాడి అనంతరం పాక్‌పై ఎదురుదాడిని ఉధృతం చేయాలన్న నిర్ణయం నేపథ్యంలో ఈ భేటీ నిర్వహించారు.

నదీ జలాల ఒప్పందంపై పూర్తి వివరాల అధ్యయనానికి అంతర్ మంత్రిత్వ టాస్క్‌ఫోర్స్ బృందాల్ని ఏర్పాటు చేయడంతో పాటు, ఒప్పందం పూర్తిస్థాయిలో తక్షణం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. టాస్క్‌ఫోర్స్ బృందంలో జలవనరులు, విదేశాంగ, విద్యుత్, ఆర్థిక శాఖల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. తూర్పుకు ప్రవహించే నదుల్లో(సింధు, చినాబ్, జీలం) భారత్ హక్కులపై బృందం అధ్యయనం చేస్తుంది. చీనాబ్‌పై పాకల్‌డల్, సవాల్‌కోట్, బుర్సార్ డ్యాంల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించారు. భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్, జలవనరుల కార్యదర్శితో పాటు పీఎంఓ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సింధు ఒప్పందం, నదులపై ఉన్న ప్రాజెక్టుల వివరాలను కేంద్ర జలవనరుల శాఖ అధికారులు ప్రధానికి కూలంకషంగా వివరించారు. భవిష్యత్తులో ‘ఇండస్ వాటర్ కమిషన్’ సమావేశాలు ఉగ్రవాద రహిత వాతావరణంలోనే సాధ్యమంటూ భేటీలో అవగాహనకు వచ్చారు. అలాగే 1987 నాటి టుల్‌బుల్ నావికా మార్గం రద్దుపై సమీక్షించాలని కూడా నిర్ణయించారు. 2007లో ఈ ప్రాజెక్టును రద్దు చేశారు. భారత్, పాక్‌ల మధ్య నదీ జలాల ఒప్పందం తమకు అనుకూలంగా లేదని గతంలో జమ్మూ కశ్మీర్ ప్రజల ఫిర్యాదు నేపథ్యంలో తాజా నిర్ణయాలతో సమాధానం దొరుకుతుందని భావిస్తున్నారు.
 
 ఒప్పందం ఇదీ..
 1960లో అప్పటి ప్రధాని నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌లు సింధు(ఇండస్) జలాల ఒప్పందంపై సంతకం చేశారు. దాని ప్రకారం భారత్.. బియాస్, రావి, సట్లేజ్ నదుల నీటిని,  పాక్ సింధు, చీనాబ్, జీలంల నీటిని వాడుకోవాలి.   9.12 లక్షల ఎకరాలకు సరిపడా సాగునీటిని భారత్ వాడుకోవచ్చు. దీన్ని మరో 4.2 లక్షల ఎకరాలకు విస్తరించవచ్చు. భారత్ 8 లక్షల ఎకరాలకు సరిపడా నీటినే వాడుతోంది. అలాగే భారత్ 18,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉండగా కేవలం 3,034 మెగావాట్లే ఉత్పత్తి చేస్తోంది. మరో 2,526 మెగావాట్ల ప్రాజెక్టుల్ని నిర్మిస్తోంది. 5,846 మెగావాట్ల ప్రాజెక్టులకు అనుమతి తుది దశలో ఉంది. తమకు తగినంత నీరు రావడం లేదంటూ పాక్ చాలాసార్లు అంతర్జాతీయ కోర్టుకెక్కింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement