అభివృద్ధిలో అటల్‌జీ ముద్ర | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో అటల్‌జీ ముద్ర

Published Mon, Dec 26 2016 2:39 AM

వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా - Sakshi

మాజీ ప్రధానికి మోదీ, షా, అడ్వాణీతోపాటు పలువురి పుట్టినరోజు శుభాకాంక్షలు
పదేళ్లుగా రాజకీయాలకు దూరంగా అటల్‌జీ
వృద్ధాప్యపరమైన వ్యాధులతో మంచానికే పరిమితం  


సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి 92వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి ఆయన చేసిన సేవలను, నాయకత్వ పటిమను కొనియాడారు. ఆదివారం ఆయన నివాసానికి పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షాతో కలిసి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. వాజ్‌పేయి కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. అనంతరం ‘ప్రియతమ, గౌరవనీయులైన అటల్‌జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను’ అని మోదీ ట్వీట్‌ చేశారు. దేశ అభివృద్ధిలో, రాజకీయాల్లోనూ ఈయన ముద్ర మరువలేనిదని మోదీ ప్రశంసించారు.  స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవీయ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వా ణీ, కేంద్ర మంత్రులు అనంత్‌కుమార్, ఎస్‌ఎస్‌ అహ్లువాలియాతో పాటు పలువురు ప్రముఖులు కూడా మాజీ ప్రధాని వాజ్‌పే యికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

మౌనంగానే మహనీయుడు
మాజీ ప్రధాని వాజ్‌పేయి ఎవరితోనూ మాట్లాడే స్థితిలోగానీ, ఎవరినీ గుర్తుపట్టే స్థితిలో గానీ లేరు. పదేళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న వాజ్‌పేయి ఏడేళ్లుగా వృద్ధాప్యపరమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చివరిసారిగా 2007లో లక్నోలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రస్తుతం ఆయన ఇక్కడి కృష్ణమీనన్‌ మార్గ్‌లో ఉంటున్నారు. ఆయన దత్తపుత్రిక నమిత.. వాజ్‌పేయి బాగోగులు చూసుకుంటున్నారు. 2009లో వచ్చిన స్ట్రోక్‌ కారణంగా ఆయన మాట్లాడలేకపోతున్నారు. వాజ్‌పేయి సన్నిహితులు ఎన్‌ఎం ఘాటటే, ఎల్‌కే అడ్వాణీ, బీసీ ఖండూరీ తరచుగా వస్తుంటారు. 2014 డిసెంబరు 24న కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించగా.. 2015 మార్చి 27న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ స్వయంగా వాజ్‌పేయి ఇంటికి వెళ్లి భారతరత్న పురస్కారాన్ని అందజేశారు.

Advertisement
Advertisement