వాళ్లు నన్ను బతకనివ్వరు.. | Sakshi
Sakshi News home page

వాళ్లు నన్ను బతకనివ్వరు..

Published Mon, Nov 14 2016 12:44 AM

వాళ్లు నన్ను బతకనివ్వరు.. - Sakshi

అయినా భయపడను.. దేశం కోసమే జీవితం అంకితం
 
- నోట్లపై 50 రోజులపాటు ఓపిక పట్టండి..మీరు కోరుకున్న భారతాన్నిస్తా
- ప్రధాని మోదీ ఉద్వేగపూరిత ప్రసంగం
 
 గాంభీర్యం, ఆత్మవిశ్వాసం కలగలిస్తే మోదీ ప్రసంగం..కానీ ఆదివారం ఆ ప్రసంగంలో గాంభీర్యం తగ్గింది. ఆ గొంతు పలుమార్లు ఉద్వేగానికి గురైంది. ఆశువుగా సాగే ప్రసంగం.. దీర్ఘ నిశ్వాసలతో గంభీర వాతావరణాన్ని సృష్టించింది. ఉబికివస్తున్న కన్నీటిని పంటిబిగువన దాచింది. దేశం కోసమే జీవితం అంకితమని..గద్గద స్వరంతో చెప్పింది. పెద్దనోట్లపై ప్రజల ఇబ్బందుల నేపథ్యంలో పణజీ, బెళగావిల్లో ప్రధాని ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. ప్రజల సమస్యలు బాధ కలిగిస్తున్నాయని.. 50 రోజులు సహకరిస్తే ప్రజలు కోరుకున్న భారతాన్నిస్తానన్నారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా అవినీతిపై మొదలుపెట్టిన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తను తప్పుచేశానని భావిస్తే బహిరంగంగా ఉరేయమన్నారు. తనను అంతమొందించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని.. దేశం కోసం ప్రాణాలిచ్చేందుకై నా వెనుకాడనన్నారు.

 పణజీ/బెళగావి: ఎప్పుడూ ప్రత్యర్థులపై విరుచుకుపడే ప్రధాని  నరేంద్ర మోదీ ఆదివారం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నోట్ల మార్పిడికోసం ప్రజలు పడుతున్న కష్టాలు తనను బాధించాయన్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ భారీ స్కామ్‌లకు పాల్పడిన వారంతా ఇప్పుడు నోట్ల మార్పిడిని వ్యతిరేకిస్తున్నారన్నారు. ‘మరో 50 రోజులు ఓపిక పట్టండి. మీరుకోరుకున్న భారతాన్ని అందిస్తాను’ అని పణజీలో జరిగిన ఓ కార్యక్రమంలో, కర్ణాటక బెళగావిలో ఉన్న కర్ణాటక లింగాయత్ ఎడ్యుకేషన్ సొసైటీ(కేఎల్‌ఈ) స్వర్ణోత్సవ వేడుకల్లో ఉద్వేగంగా ప్రసంగించారు. తనను సజీవ దహనం చేసినా అవినీతిపై మొదలుపెట్టిన పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ‘కొన్ని శక్తులు నాకు వ్యతిరేకంగా కుట్రపన్నుతున్నాయన్న విషయం తెలుసు.

నన్ను ప్రాణాలతో ఉంచకూడదని అనుకుంటున్నారు. 70 ఏళ్లుగా వారు దాచుకున్న అవినీతి డబ్బును ఏం చేయాలో తోచక నన్ను నాశనం చేద్దామనుకుంటున్నారు. అందుకు నేను సిద్ధంగానే ఉన్నాను’ అని ఉద్వేగంగా ప్రసంగించారు. నిజారుుతీగా ఉన్న వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులుండవన్న మోదీ.. అవినీతిపరులను వదిలేది లేదన్నారు. దేశం ఇన్నాళ్లూ దోపిడీకి గురైందా లేదా? అని సభికులను ప్రశ్నించారు. ‘ఓ 50 రోజులు నాకు సహకరించండి. నా చర్యలు, ఆలోచనల్లో మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే బహిరంగంగా ఉరితీయండి. ఎవరైనా ఇబ్బంది పడితే. అది నాకు బాధ కలిగిస్తుంది. నేను మీ బాధను అర్థం చేసుకుంటున్నాను. 50 రోజుల్లో ప్రక్షాళన జరుగుతుంది. మీరు కోరుకున్న భారత్‌ను మీకందిస్తాను’ అని ఉద్వేగంతో అన్నారు. ఉన్నతస్థానం అందుకునేందుకే పుట్టలేదని, దేశం కోసం కుటుంబాన్ని, ఊరినీ వదిలొచ్చానన్నారు. తన వ్యాఖ్యలు గర్వంతో కూడినవి కావని.. ప్రజల బాధ చూసి తనకూ బాధకలుగుతోందన్నారు.

 అవినీతి రహిత భారత్‌కై ..  ‘కరెన్సీ మార్పిడి ప్రక్రియ ఇంతటితో ఆగదు. భారత్‌ను అవినీతి రహితంగా మార్చేందుకు నా మదిలో చాలా ప్రాజెక్టులున్నారుు. బినామీ ఆస్తులపై కఠిన చర్యలు తప్పవు. అవినీతి, నల్లధనానికి అడ్డుకట్ట వేసేందుకు ఇది కీలక ప్రక్రియ. ఇక్కడ దోపిడీ జరిగిన డబ్బు సరిహద్దులు దాటితే దాన్ని గుర్తించి తీసుకురావటం మా బాధ్యత’ అని అన్నారు. భవిష్యత్తులో నగదు రహిత విధానాన్ని, ప్లాస్టిక్ కరెన్సీని అందుబాటులోకి తెచ్చుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. నోట్ల మార్పిడి ప్రక్రియను వ్యతిరేకిస్తున్న వారంతా, ప్రత్యేకంగా కాంగ్రెస్ నేతలు భారీ స్కామ్‌లకు పాల్పడ్డారని.. వాటిని మార్చుకునేందుకు ఇప్పుడు క్యూలైన్లో నిలబడుతున్నారని విమర్శించారు.

 ప్రజల ఆకాంక్షల మేరకే..
 ‘కాంగ్రెస్ 25 పైసలను ఆపినప్పుడు మేమేమీ అనలేదు. మీరు కేవలం పావలాను మాత్రమే ఆపేంత పరిమితిలోనే పనిచేశారు. మీరు చేయనిది మేం చేస్తున్నాం. ప్రజలు భారీ ఆశలతో మాకు అవకాశం ఇచ్చారు. వారి  ఆకాంక్షలను నెరవేర్చేందుకు  మేం పనిచేస్తున్నాం. నల్లధనంపై సిట్ ఏర్పాటుకోసం చర్చించేందుకు జరిగిన తొలి కేబినెట్ భేటీ నుంచి చిత్తశుద్ధితో ఉన్నాం. మేం ప్రజలకు తెలియకుండా ఎప్పుడూ ఏమీ చేయలేదు’ అని మోదీ అన్నారు. క్షమాభిక్ష పథకం ద్వారా రూ.67వేల కోట్లు వచ్చాయని.. రెండేళ్లలో వివిధ చోట్ల దాడులు, సర్వేలు, డిక్లరేషన్‌ల ద్వారా రూ1.25 లక్షల కోట్లు ఖజానాలో చేరిందన్న ప్రధాని.. అధికారంలోకి వచ్చాక చిన్న చిన్న చిట్కాల ద్వారా ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. జన్‌ధన్ పథకం కూడా ఇందులో భాగమేనని పేర్కొన్నారు.

 పరీకర్ ఓ అమూల్య రత్నం.. ప్రత్యర్థిపై యుద్ధానికి ఆదేశించటం ప్రభుత్వానికి పెద్ద విషయమేమీ కాదని.. కానీ తర్వాత ఎదురయ్యే సమస్యలతో సామాన్యులు ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని పణజీ కార్యక్రమంలో మోదీ తెలిపారు. కేంద్ర మంత్రి మనోహర్ పరీకర్.. కేంద్ర కేబినెట్‌లోని నవరత్నాల్లో ఒకరని ప్రధాని ప్రశంసించారు. చాలా ఏళ్ల తర్వాత దేశం.. ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే రక్షణ మంత్రిని చూసిందన్నారు. నిరంతరం విరామం లేకుండా దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేస్తున్న రత్నాన్ని గోవాయే దేశానికి అందించిందన్నారు.

 నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యవర్గం భేటీ
 రూ.500, రూ.1000 కరెన్సీ నోట్ల రద్దు, ఒకే ర్యాంక్-ఒకే పెన్షన్ వంటి అంశాలపై పార్లమెంటులో విపక్షాలు విరుచుకుపడనున్న నేపథ్యంలో వ్యూహరచన చేసేందుకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యవర్గం నేడు ఢిల్లీలో భేటీ కానుంది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సహా పార్టీ అగ్రనేతలు ఈ భేటీలో పాల్గొననున్నారు.
 
 భవిష్యత్తు బాగుంటుంది
 ‘పదినెలల క్రితం ఓ చిన్న జట్టుతో కలసి రహస్య ఆపరేషన్ ప్రారంభించాను. ఇది పరీకర్ చేపట్టిన సర్జికల్ దాడు ల్లాంటిది కాదు. కరెన్సీ నోట్లను ప్రింట్ చేసి చూసుకోవాలి. రహస్యంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే అవినీతి పరులు ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటారు’ అని మోదీ తెలిపారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నా.. భవిష్యత్తులో చాలా లాభాలుంటాయన్నారు. దేశంలో కొన్ని లక్షల మంది అవినీతి పరులను మినహారుుస్తే.. ప్రజలందరూ ఈ నిర్ణయాన్ని విజయవంతం చేసేందుకు సహకరిస్తున్నారని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
 
 అవినీతిపరులకు నిద్రలేదు
 నవంబర్ 8 రాత్రి నిర్ణయం వెలువరించగానే ప్రజలంతా హారుుగా నిద్రపోతే.. అవినీతి పరులు నిద్ర మాత్రలు వేసుకున్నా కన్నుమూయలేకపోయారని మోదీ అన్నారు. ఆభరణాల కొనుగోలుకు పాన్ కార్డును తప్పనిసరి చేసే నిర్ణయాన్ని వెనక్కుతీసుకోమని చాలా మంది ఎంపీలు అడిగారన్నారు. నిన్నటి వరకు తల్లిదండ్రులను పట్టించుకోని వారు కూడా ఇప్పుడు వారి అకౌంట్లలో లక్షలకు లక్షలు వేస్తున్నారు. నల్లధనం వ్యర్థమైపోతుండటంతో.. కొందరు కావాలనే ఉప్పు కొరతను సృష్టిస్తున్నారని మోదీ విమర్శించారు. ‘నగల వ్యాపారులను ఐటీ అధికారులు వేధిస్తారనే భయాందోళనలు వద్దు. అలాంటి అధికారులతో మాట్లాడిన మాటలు రికార్డు చేసి పంపించండి. వారి సంగతి నేను చూసుకుంటానని నగల వ్యాపారులందరికీ నేను భరోసా ఇస్తున్నా’ అని తెలిపారు. ‘నల్లధనాన్ని దాచిన వారంతా ఇప్పుడిక డబ్బును గంగలోనైనా కలపాలి. లేదంటే చెత్తకుండీల్లో  పడేయాలి. అలా కాకుండా బ్యాంకుల్లో జమచేస్తే మాత్రం వారి మొత్తం చిట్టా విప్పుతా. 200 శాతం జరిమానాతో పాటు శిక్ష కూడా తప్పనిసరి. ఈ డిసెంబర్ 30 తర్వాత మోదీ అంటే ఏమిటో వారికి తెలిసివస్తుంద’ని  హెచ్చరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement