మళ్లీ స్వర్గధామం చేద్దాం..! | Sakshi
Sakshi News home page

మళ్లీ స్వర్గధామం చేద్దాం..!

Published Wed, Aug 16 2017 12:39 AM

మళ్లీ స్వర్గధామం చేద్దాం..! - Sakshi

కశ్మీర్‌పై ప్రధాని మోదీ పిలుపు
►  ఆ సమస్య దూషణలు, తూటాలతో పరిష్కారం కాదు
► ఆత్మీయ ఆలింగనంతోనే అది సాధ్యం
► ఉగ్రవాదులు, ఉగ్రవాదంపై మెతక వైఖరి ప్రసక్తే లేదు  
►  ట్రిపుల్‌ తలాఖ్‌పై పోరులో మహిళలకు అండగా ఉన్నాం
► 71వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ


ఈ సంవత్సరం 56 లక్షల ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. ఇది గతేడాది కన్నా రెండింతలు. నల్లధనంపై మన పోరాట విజయాన్ని చెప్పేందుకు ఈ గణాంకాలు చాలు.
దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవించాయి. ఓ ఆస్పత్రిలో చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. దేశ ప్రజల సానుభూతి వారితో ఉంది.
జీఎస్టీ అమలు ఒక సాంకేతిక అద్భుతం. సహకార సమాఖ్య విధానానికి ఒక మచ్చుతునక.
నిరాశావాదం మధ్య పెరిగాం కానీ ఇప్పుడు సుదృఢ విశ్వాసంతో ముందడు గు వేద్దాం. ఏదో నడుస్తోందిలే.. అనే ఆలోచనాధోరణిని విడనాడుదాం.
నోట్ల రద్దుతో అవినీతికి అడ్డుకట్ట పడింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం రూ. 3 లక్షల కోట్లు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చాయి. అందులో రూ. 2 లక్షల కోట్లు నల్లధనం.
విశ్వాసాల ప్రాతిపదికన హింస ఎంతమాత్రం సమర్థనీయం కాదు.. మతవాదం, కులతత్వం విషంతో సమానం

న్యూఢిల్లీ: కల్లోల కశ్మీర్‌ను మరొకసారి భూలోక స్వర్గంగా మార్చేందుకు ప్రతిజ్ఞ చేద్దామంటూ దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కశ్మీర్‌ సమస్య దూషణలతోనో, తూటాలతోనో పరిష్కారం కాదని తేల్చి చెప్పిన ప్రధాని.. అందుకు కశ్మీరీలను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, వారితో మమేకం కావడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. కొంతమంది వేర్పాటువాదులు మాత్రం రాష్ట్రంలో సమస్యలు సృష్టించేందుకు పన్నాగాలు పన్నుతున్నారని విమర్శించారు. సంప్రదాయ కుర్తా, పైజామా, రాజస్తానీ తలపాగాతో స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన ప్రధాని మంగళవారం ఉదయం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

అనంతరం ప్రధానిగా నాలుగోసారి ఎర్రకోట నుంచి ప్రసంగించిన మోదీ.. గత మూడేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలు, కీలక నిర్ణయాల్ని ప్రస్తావించారు. ముఖ్యంగా నోట్ల రద్దు, జీఎస్టీ అమలు సాహసోపేత నిర్ణయాలని అభివర్ణించారు. అవినీతి, నల్లధనంపై పోరు కొనసాగుతుందని, దేశాన్ని దోచుకున్నవారు సమాధానం చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదులపై, ఉగ్రవాదంపై కఠిన వైఖరి కొనసాగుతుందని తేల్చి చెప్పారు. చైనాతో డోక్లాం వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. సముద్రం, సరిహద్దులు ఎక్కడైనా సరే, ఎలాంటి భద్రతా సవాలునైనా ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందన్నారు.

విశ్వాసాల పేరిట జరిగే హింస ఆమోదయోగ్యం కాదని, మతవాదం, కులతత్వం విషంతో సమానమని పేర్కొన్నారు. దేశం ఎదుర్కొన్న ప్రకృతి విపత్తులను, యూపీ ఆస్పత్రిలో ఇటీవలి చిన్నారుల మరణాలను ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని.. వారికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. తన ముందు శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న చిన్నారులను చూపిస్తూ.. దేశ ఘన సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేశారు. ఒక మోహనుడు చక్ర(సుదర్శన) ధారుడైతే.. మరో మోహనుడు(మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ) చరఖాను ప్రసిద్ధం చేశారంటూ ఆసక్తికర వ్యాఖ్యానం చేశారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే...

 గత ఏడాదిగా కశ్మీర్‌లో అస్థిర పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే కశ్మీరీల సమస్యలు బుల్లెట్లు, ఆరోపణలతో పరిష్కారం కావు. కశ్మీరీల ఆత్మీయ కౌగిలితోనే ఆ మార్పు సాధ్యం. కేవలం కొద్దిమంది వేర్పాటువాదులు.. రాష్ట్రంలో సమస్యలు సృష్టించేందుకు వివిధ ఎత్తుగడలు అనుసరిస్తున్నారు. అయితే కశ్మీర్‌కు గత వైభవం తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మళ్లీ భూతల స్వర్గంగా మార్చుతాం. అభివృద్ధి కోసం కశ్మీరీల కలల్ని నెరవేర్చేందుకు జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వమే కాకుండా దేశం మొత్తం సాయపడుతోంది.

మతతత్వం, కులతత్వం విషం లాంటివి.. స్వాతంత్య్ర సమరంలో భారత్‌ ఛోడో(క్విట్‌ ఇండియా) నినాదం భారత్‌ జోడో(భారత్‌ అనుసంధానం) నినాదంగా మారాలి. రోజురోజుకూ భారత కీర్తి ప్రతిష్టలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఉగ్రవాదంపై పోరులో అనేక దేశాలు భారత్‌కు అండగా ఉన్నాయి. క్లిష్ట పరిస్థితుల్లో భారత సైన్యం, నేవీ, వాయుసేనలు తమ సామర్థ్యం, ధైర్యాన్ని ప్రదర్శించాయి.

‘చల్తా హై’ ధోరణి మారాలి
కలసికట్టుగా సాగితేనే దేశంలో గుణాత్మక మార్పు సాధ్యం. 9 నెల్లలో మనం మంగళ్‌యాన్‌ను సుసాధ్యం చేశాం. అదే సమయంలో నాలుగు దశాబ్దాలుగా రైల్వే ట్రాక్‌ ప్రాజెక్టు మాత్రం పూర్తి చేయలేకపోయాం. ఇలాంటి పరిస్థితులు మారాలి. ‘చల్తా హై’ ధోరణి వదిలిపెట్టాలి. బదల్‌ సక్తా హై (మార్చాలి) అన్న సాను కూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి. బాల గంగాధర్‌ తిలక్‌ నినాదమైన స్వరాజ్‌.. ఇప్పుడు సురాజ్‌ (సుపరిపాలన) కావాలి. 2022 నాటికి నవ భారతం ఆవిష్కృతమవ్వాలి. ఆ దిశగా ప్రయాణానికి ప్రజలే చోదక శక్తి.    

జీఎస్టీతో 30% తగ్గిన సరుకు రవాణా సమయం
జీఎస్టీ అమలు విజయవంతమైన ప్రయోగం, అలాగే సాంకేతికత అద్భుతం. జీఎస్టీతో రాష్ట్రాల సమాఖ్య సహకార స్ఫూర్తి వెల్లడైంది. ఈ ఏకీకృత పన్నుకు మద్దుతుగా దేశం మొత్తం కలిసికట్టుగా ముందుకొచ్చింది.   జీఎస్టీ అమలుతో చెక్‌పోస్టులు తొలగించడం వల్ల సరుకు రవాణా సమయం 30 శాతం తగ్గింది. దీంతో రూ. వేల కోట్లు ఆదా అవుతున్నాయి. అవినీతి, నల్లధనంపై మన పోరు కొనసాగుతుంది.

భారతదేశ ఉజ్వల భవిష్యత్తు, ప్రజల శ్రేయస్సు కోసం ఈ పోరాటం చేస్తున్నాం. దేశ సంపదను దోచుకున్న వారు సమాధానం చెప్పక తప్పదు. రూ. 800 కోట్ల బినామీ ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నాం.  అభివృద్ధి వైపు వేగంగా దేశాన్ని తీసుకెళ్తున్నాం. పేదలందరికీ పక్కా ఇళ్లు, విద్యుత్, నీరు అందించగలిగే భారతాన్ని నేను కోరుకుంటున్నా. ఎలాంటి ఆందోళన లేకుండా రైతులు ప్రశాంతంగా నిద్రపోవాలి. వారు విత్తిన దానికి రెండింతలు ఫలసాయం పొందాలి.

ట్రిపుల్‌ తలాఖ్‌పై వ్యతిరేక వాతావరణం  
ట్రిపుల్‌ తలాఖ్‌పై పోరాడుతున్న మహిళల హక్కుల్ని సాధించే ప్రయత్నంలో దేశం వారి వెంట ఉంది. ఈ విధానంపై యావత్‌ దేశం ఆందోళన చెందింది. ట్రిపు ల్‌ తలాఖ్‌ వల్ల దుర్భర జీవితం గడుపుతున్న మహిళలకు నా సానుభూతి తెలుపుతున్నా. వారు ప్రారంభించిన ఉద్యమంతో దేశంలో తలాఖ్‌కు వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించడంలో విజయం సాధించారు.

నల్లధనానికి అడ్డుకట్ట వేశాం: మోదీ
నోట్ల రద్దుతో నల్లధనం ప్రవాహానికి, అవినీతికి అడ్డుకట్ట వేశాం. నల్లధనాన్ని బ్యాంకులకు తీసుకురావడం, చలామణీలో ఉన్న నగదులో భాగం చేసేందుకు చేసిన ప్రయత్నాల్లో విజయం సాధించాం. నల్లధనంపై పోరు కొనసాగిస్తాం. దేశాన్ని, పేదల్ని దోచుకున్నవారు ఈ రోజు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. నోట్ల రద్దు అనంతరం బ్యాంకుల్లో జమ చేసిన 1.75 లక్షల కోట్ల అనుమానిత నగదుపై ప్రభుత్వం ఆరాతీస్తోంది.  18 లక్షల ప్రజల అక్రమార్జనపై కూడా విచారణ కొనసాగుతోంది.

నోట్ల రద్దుతో లెక్కల్లో లేని రూ. 3 లక్షల కోట్ల సంపదను బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తీసుకొచ్చాం. ఇది ప్రభుత్వ వేసిన లెక్క కాదు. నిపుణులే స్వయంగా చెప్పిన వాస్తవం. అందువల్ల బ్యాంకులకు వడ్డీని తగ్గించే అవకాశం ఏర్పడింది. బ్యాంకుల్లో నల్లధనం జమ చేసిన వారు వాటికి లెక్క చెప్పాల్సిన పరిస్థితి తీసుకొచ్చాం. పన్ను చెల్లింపుదారుల సంఖ్య రెండింతలై 56 లక్షలకు చేరింది. గతేడాది ఆ సంఖ్య కేవలం 22 లక్షలే. మొత్తం 3 లక్షల షెల్‌ కంపెనీలను గుర్తించగా.. అందులో 1.75 లక్షలు మూతపడ్డాయి. గత ఏడాది కాలంలో డిజిటల్‌ చెల్లింపులు 34 శాతం పెరిగాయి. గత మూడేళ్లలో రూ. 1.25 లక్షల కోట్లకు పైగా నల్లధనాన్ని గుర్తించాం.

ఈసారి 56 నిమిషాలే...
ఉదయం 7.23 గంటలకు ఎర్రకోటకు చేరుకున్న ప్రధాని మోదీకి రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ, సహాయ మంత్రి సుభాష్‌ బామ్రే స్వాగతం పలికారు.
♦  ఈసారి వేడుకకు హాజరైనవారిలో అధికంగా స్కూలు విద్యార్థులే ఉన్నారు.
♦  సరిగ్గా 7.30 గంటలకు మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు.
♦  ఈసారి ప్రొటోకాల్‌ స్వల్పంగా మారింది. గతంలో జీఓసీ(ఢిల్లీ జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌) నిల్చొని ఉండగా, ఈ ఏడాది ప్లాట్‌ఫాంకు సమీపంలో ఆయనకు సీటు ఏర్పాటు చేశారు.
♦  ఈసారి మోదీ ప్రసంగం 56 నిమిషాలే సాగింది. పంద్రాగస్టు వేడుకలో ఆయన ఇంత తక్కువ సమయం మాట్లాడటం ఇదే తొలిసారి. గతేడాది 96 నిమిషాలు ప్రసంగించి ఎక్కువ సమయం మాట్లాడిన ప్రధానిగా రికార్డు సృష్టించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన ప్రసంగం సుదీర్ఘంగా ఉంటోందంటూ ఫిర్యాదులు అందాయని, ఈసారి దాన్ని కుదిస్తానని గత నెల ‘మన్‌కీ బాత్‌’లో చేసిన వాగ్దానాన్ని మోదీ నిలబెట్టుకున్నారు.
♦  సారే జహాసే అచ్చా గీతాలాపన సమయంలో మోదీ తన చేతులతో పోడియాన్ని లయబద్ధంగా తట్టడం కనిపించింది.
♦  వరసగా నాలుగో ఏడాది కూడా మోదీ బుల్లెట్‌ ప్రూఫ్‌ ఎంక్లోజర్‌ కాకుండా బహిరంగ పోడియం నుంచే ప్రసంగించారు.

కొత్తదనమేం లేదు: విపక్షాలు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ పంద్రాగస్టు ప్రసం గంపై ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. అది పూర్తి నిరాశజనకంగా ఉందని కాంగ్రెస్‌ ఆరోపించగా, కొత్తదనమేం లేదని లెఫ్ట్‌ పార్టీలు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ స్పందిస్తూ...గోరఖ్‌పూర్‌ ఆసుపత్రిలో చిన్నారుల మరణాలను మోదీ ప్రకృతి విపత్తులతో పోల్చడం సరికాదని అన్నారు. రైతులు, యువత, బలహీన వర్గాలకిచ్చిన హామీల అమలులో వైఫల్యంపై ప్రధాని సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ కల్పనను ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.

Advertisement
Advertisement