అఖ్లాక్ కుటుంబంపై చర్య తీసుకోవాలి | Sakshi
Sakshi News home page

అఖ్లాక్ కుటుంబంపై చర్య తీసుకోవాలి

Published Thu, Jul 14 2016 5:04 PM

అఖ్లాక్ కుటుంబంపై చర్య తీసుకోవాలి

దేశంలో 'అసహనం' వ్యాఖ్యలకు దారితీసిన దాద్రి ఘటన గుర్తుండే ఉంటుంది కదూ. హత్యకు గురైన మహ్మద్ అఖ్లాక్(50) కుటుంబంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్థానిక కోర్టు ఆదేశించింది. గతేడాది యూపీలోని దాద్రి ప్రాంతంలో 50 ఏళ్ల మహ్మద్ అఖ్లాక్‌ అనే వ్యక్తి ఇంట్లో ఆవు మాంసం ఉందని కొందరు వ్యక్తులు అతడిని ఇంట్లోంచి బయటకు లాగి హత్యచేశారు. ఆ దాడిలో ఆయన కుమారుడు డానిష్ అక్లాక్ తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందాడు.

బిసాడాకు చెందిన కొందరు వ్యక్తులు అఖ్లాక్ కుటుంబంపై కేసు నమోదు చేయాలని, చర్యలు తీసుకోవాలని పిటీషన్ దాఖలు చేశారు. అఖ్లాక్ ఫ్యామిలీ ఆవును చంపేశారని, అతడి సోదరుడు జాన్ మహ్మద్ జంతువు తలను పారవేయడం చూశామని బిసాడా గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన స్థానిక కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది.

ఆవు లేదా దూడ మాంసమేనని ఫోరెన్సిక్ పరీక్షలో గత నెలలో వెల్లడైంది. తొలుత అది మటన్ అనే తాము భావించామని, కానీ తర్వాత అది ఆవుమాంసం అన్న విషయం తేలిందని యూపీ డీజీపీ జావేద్ అహ్మద్ ఫోరెన్సిక్ పరీక్షల అనంతరం తెలిపారు. యూపీలో ఆవుమాంసం తినడం నేరం కాదు గానీ, ఆవులను చంపడం మాత్రం నేరమే. అఖ్లాక్ హత్య కేసులో అరెస్టయిన 18 మందిలో స్థానిక బీజేపీ నేత కుమారుడు కూడా ఉన్నారు.

Advertisement
Advertisement