అలవిగాని హామీలకు... అంతం ఎప్పుడు? | Sakshi
Sakshi News home page

అలవిగాని హామీలకు... అంతం ఎప్పుడు?

Published Sat, Apr 8 2017 8:33 PM

అలవిగాని హామీలకు... అంతం ఎప్పుడు? - Sakshi

‘‘ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకపోవడం సర్వసాధారణమైంది. మ్యానిఫెస్టోలు కాగితాలకే పరిమితమైపోతున్నాయి. మ్యానిఫెస్టోలు ఇచ్చే హామీలకు రాజకీయ పార్టీలను జవాబుదారీగా చేయాలి’’ – శనివారం ఢిల్లీలో ఓ సదస్సులో మాట్లాడుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జే.ఎస్‌.ఖేహర్‌

దేశం లేదా రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తాము అధికారంలోకి వస్తే ఎలా పరిష్కరిస్తారో సవివరంగా చెప్పడానికి ఉద్దేశించినవే మ్యానిఫెస్టోలు. దురదృష్టవశాత్తు మన దేశంలో జరుగుతున్నది వేరు. అలవిగాని హామీలన్నీ ఇచ్చి ఓట్లు దండుకోవడం... అధికారంలోకి వచ్చాక మర్చిపోవడం, కుంటిసాకులు చెప్పడం పరిపాటి అయ్యింది. ఎందుకంటే ప్రజలు తొందరగా మర్చిపోతారనే నమ్మకం, రెండోది... ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పార్టీలను జవాబుదారీ చేసే చట్టాలేమీ లేకపోవడం.

హామీలను విస్మరించిన పార్టీలను కోర్టుకీడ్చి శిక్షించే చట్టాలేవీ భారత్‌లో లేవు. ఫలితంగానే ఎన్నికలకు ముందు పార్టీలు ఇచ్చే హామీలు కోటలు దాటుతున్నాయి. ఆచరణకు వస్తే అంగుళం కదలడం లేదు. మన దేశంలో ఈ దిశగా జరిగిన ప్రయత్నాలను, చట్టాలు చేయాల్సిన ఆవశ్యకత, నిపుణుల సూచనలను ఓసారి చూద్దాం.

చట్టాలు లేవు... ఏమీ చేయలేం
పార్టీలను జవాబుదారీగా చేయాలని 2013లో సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే భారత్‌లో అలాంటి చట్టమేదీ లేనందున పిటిషన్‌కు విచారణార్హత లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చింది. అయితే ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు సూచించింది. దాంతో ఈసీ మెనిఫెస్టో తయారీకి అనుసరించాల్సిన విధివిధానాలపై  2014కు ముందు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించింది. రెండు కీలకమైన నిబంధనలను ఎన్నికల ప్రవర్తన నియమావళిలో చేర్చింది.

ఈసీ ఏం చెప్పింది...
1. ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలున్న హామీలను రాజకీయ పార్టీలు ఇవ్వకూడదు.
2. జవాబుదారీతనం, బరిలో నిలిచిన పార్టీలన్నింటికీ సమాన అవకాశాలు ఉండేలా చూడటం, ఇచ్చిన హామీలపై ప్రజలకు నమ్మకం కలిగించడానికి వీలుగా... తామిచ్చిన హామీల్లో హేతుబద్ధతను మెనిఫెస్టోలు వివరించాలి. వీటి అమలుకు అవసరమైన నిధులను ఎలా సమకూర్చుకుంటారనేది స్థూలంగా చెప్పాలి. అమలు చేయగలిగిన హామీలను మాత్రమే ఇచ్చి... ఓటర్ల విశ్వాసాన్ని చూరగొనాలనేది వీటి ఉద్దేశం. ఏదైనా హామీని ఇచ్చే ముందు ఒకటి రెండుసార్లు పార్టీలు ఆలోచించాలనేది అభిమతం. అయితే రాజకీయ పార్టీలు షరామామూలుగానే వీటిని పట్టించుకోలేదు.

శిక్షార్హమైన నేరంగా పరిగణించాలి...
ఎన్నికల సంస్కరణల ఆవశక్యత, చర్చ జరగాల్సిన అవసరంపై గత కొద్దికాలంగా మోదీ మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ధనప్రవాహానికి అడ్డుకట్ట వేయడం, రాజకీయాలు నేరమయం కాకుండా చూడటం, పార్టీ ఫిరాయింపులు... తదితర అంశాలతో పాటు మెనిఫెస్టోకు పార్టీలను జవాబుదారీ చేసే అంశంపైనా విస్లృతంగా చర్చ జరగాలి. ప్రజాస్వామ్యం అపహస్యం కాకుండా చూడాల్సిన సమయం ఆసన్నమైంది. మెనిఫెస్టోలో ఆచరణ సాధ్యమైన హామీలనే పార్టీలు ఇచ్చే పరిస్థితి రావాలంటే ఏం చేయాలో వివిధ సందర్భాల్లో నిపుణులు చేసిన సూచనల్లో కొన్ని...

►అధికారంలోకి వచ్చాక మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే... శిక్షార్హమైన నేరంగా పరిగణించాలి. ఈ మేరకు చట్టాలు చేయాలి. మాటతప్పే పార్టీలను కోర్టుకీడ్చుతూ పిల్‌ వేసే అవకాశం కల్పించాలి. అప్పుడే మోసపూరిత హామీలకు అడ్డుకట్ట పడుతుంది.
► ఏ హామీ అమలుకు ఎంత డబ్బు అవసరమవుతుంది... దాన్ని ఎలా సమకూర్చుకుంటారనేది మ్యానిఫెస్టోలోనే స్పష్టంగా చెప్పడం తప్పనిసరి చేయాలి.. దీనిమూలంగా అలవిగాని హామీలను నిరోధించొచ్చు.
►ఏ హామీని ఎప్పటిలోగా చేస్తారో నిర్దిష్ట కాలపరిమితిని చెప్పాలి.
► అలాగే ఏదైనా పథకాన్ని ఎంతమందికి వర్తింపజేస్తారో స్థూలంగా ఒక సంఖ్యను చెప్పాలి. లేకపోతే ఏ వంద మందికో లబ్ధి చేకూర్చి తన ఎన్నికల హామీ అమలు చేశామని పార్టీలు చేతులు దులుపుకునే అవకాశాలుంటాయి.
►పార్టీల మ్యానిఫెస్టోల తయారీ ఎన్నికలకు ఆరు నుంచి తొమ్మిది నెలల ముందే ప్రారంభం కావాలి. సంబంధిత రంగానికి చెందిన నిపుణులతో విస్తృతంగా చర్చించి... సాధ్యాసాధ్యాలను మదింపు చేసుకోవాలి.
► వీటిని ప్రజా వేదికలపై చర్చించాలి.
►పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలను ఈసీ వద్ద రిజిస్టర్‌ చేయాలి. అలాగే కొన్ని దేశాల్లో మ్యానిఫెస్టోలు, అందులో చెప్పిన విషయాల అమలులో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాకే మ్యానిఫెస్టోల విడుదలకు ఎన్నికల కమిషన్‌ అనుమతించే విధానం అమలులో ఉంది. దీనికి కూడా పరిశీలించొచ్చు.
►ఉచిత హామీలను అనుమతించకూడదు. అధికారంలోకి రావడమే పరమావధిగా రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా ఉచిత హామీలు, రుణమాఫీ హామీలు ఇవ్వడం మూలంగా రాష్ట్రాలు తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఉచిత హామీలు, సబ్సిడీల కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి మాసాంతానికి తమిళనాడు అప్పులు 2.52 లక్షల కోట్లకు చేరాయి.

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement
Advertisement