పాజిటివ్‌ పీపుల్‌ - ది రియల్‌ హీరోస్‌ | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 30 2017 6:49 PM

Positive People The Real Heroes - Sakshi

సాక్షి : ఈ వ్యాసం వ్రాసే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో స్త్రీల ప్రాధాన్యత సంతరించుకొన్న గ్లోబర్‌ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్‌ సమ్మిట్‌ ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీల ప్రాధాన్యతను వారి యొక్క పాత్రను తెలియజేస్తూ అప్పుడే జరిగిన ‘‘అమరావతి డిక్లరేషన్‌’’. ఈ రెండు ఈవెంట్లలో స్త్రీలు ప్రముఖ పాత్రను పోషించం ఎంతైనా హర్షింపదగ్గ విషయం.

ఇదే సమయంలో అంతర్జాతీయ ఎయిడ్స్‌ దినం కూడా జరుగుతున్నది. ఆలోచన చేస్తే ఎయిడ్స్‌ని ధైర్యంగా ఎదుర్కొని, తాము జీవిస్తూ, తమ కుటుంబాలను పోషిస్తూ సమాజానికి సేవ చేస్తున్న రియల్‌ హీరోలు ఎందరో గుర్తుకు వస్తున్నారు. ఎయిడ్స్‌ను గురించి నాకు అవగాహన, దానిని డీల్‌ చేయటంలో నాకు స్ఫూర్తినిచ్చిన నా రియల్‌ హీరో(పేరు వ్రాయడం లేదు) గురించి వ్రాయాలని అనిపించింది. ఆమె వయస్సు దాదాపు 30 సంవత్సరాలు ఉండేది. తాను పాజిటివ్‌ పర్సన్‌ అని తెలిసిన తరువాతనే మా ఇద్దరి పరిచయం ఇంకా బలపడింది.

తనను చూస్తే ఆమె చాలా ఆరోగ్యంగా అందరి కంటే హుషారుగా పనిచేసేది. ఆమె తన కుటుంబాన్ని పోషిస్తూ ఎందరో పాజిటివ్‌ పర్సన్స్‌ని ధైర్యంగా ముందుకు నడిపించేది. ఆత్మనూన్యత అనే పదం ఆమె దరిదాపుల్లో ఉండేది కాదు. మేము అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం, ఒకరి గ్లాసులో ఒకరం నీళ్ళు త్రాగేవాళ్ళం. నా రియల్‌ హీరో హెచ్‌.ఐ.వి. ఎయిడ్స్‌ మీద పూర్తి పరిజ్ఞానం కలిగి, ఎయిడ్స్‌ ఎలా వస్తుందో దానిని ఎలా నివారించాలో చక్కని క్లాసులు నిర్వహించేది. ఆమె, ఆమె లాంటి ఎందరో నా పాజిటివ్‌ సోదరీలు, సోదరులు ఇచ్చిన స్ఫూర్తి నా జీవితంలో ఎలాంటి క్లిష్టపరిస్థితిని అయినా ఎదుర్కొగలనని ధైర్యాన్నిచ్చింది. ప్రస్తుతం ఆమె మా మధ్యలో లేకపోయిన ఆమె మాకు ఇచ్చిన స్ఫూర్తి చూయించిన ధృడ సంకల‍్పం ఎప్పటికీ మరువలేనిది. 

ఈ సందర్భంగా పాజిటివ్‌ పర్సన్స్‌తో సమాజం, సంస్థలు, వ్యక్తులు, ప్రభుత్వాలు పాజిటివ్‌ పర్సన్స్‌తో ఎలా కలిసి జీవించాలో అంతర్జాతీయ శ్రామిక సంస్థ(ILO)  భారత ప్రభుత్వం కొన్ని స్వచ్ఛంధ సంస్థలు పాటిస్తున్న నియమనిబంధనలను క్రోడికరిస్తున్నాను.

1. మనం పని చేసే ప్రాంతాలలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ ప్రబలకుండా యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి మీద సిబ్బందికి పూర్తి అవగాహన కలిపించాలి.
2. మనతో పని చేస్తున్న మన సహచర పాజిటివ్‌ పర్సన్స్‌ ఎలాంటి వివక్షతకు గురికాకుండా మనందరితో సమానంగా చూసుకోవాలి. దీనికి పూర్తి బాధ్యత యాజమాన్యం తీసుకోవాలి. 
3. ఆఫీసులో పని ప్రాంతాలలో స్త్రీలు లింగ వివక్షతకు గురికాకుండా చూడాలి. 
4.పనిచేసే ప్రాంతాలలో పాజిటివ్‌ పర్సన్స్‌కి ఆరోగ్యకరమైన సురక్షితమైన వాతావరణం ఏర్పాటు చేయాలి.
5. సిబ్బంది నియామక సమయాల్లో HIV/AIDS సంబంధిత వ్యక్తిగత విషయాలు అడుగకూడదు.
6. HIV/AIDS ఉందని తెలిస్తే ఆ విషయాన్ని గుప్తంగా ఉంచాలి. ఎటువంటి పరిస్థితుల్లో బహిరంగపరచకూడదు. HIV/AIDS ఉన్నవారు పనిలో చేరవచ్చును.. అదే విధంగా పనిలో కొనసాగవచ్చు. HIV/AIDS      ఉన్నదని ఒక వ్యక్తిని పనిలో నుంచి తీసివేయ్యటానికి వీలులేదు. ఉద్యోగం అన్నది అతడు లేక ఆమె యొక్క జీవన భద్రత హక్కు, ఆరోగ్యకరమైన ఆహారం, మందులు వేసుకుంటే ఎన్నిరోజులైన                          పనిచేయవచ్చును.
7. పాజిటివ్‌ పర్సన్స్‌కు వీలైనంత వరకు ఒత్తిడిలేని పనిని ఇవ్వాలి. వారి ఆరోగ్యం, పౌష్టికాహారం గురించి ఆలోచించాలి.   అందరూ కలిసి ఆరోగ్యకరమైన పని వాతావరణంలో పని చేయుటకు యాజమాన్యం తగు       చర్యలు తీసుకోవాలి. 


ఏప్రిల్‌ నెల 2017లో కేంద్ర ప్రభుత్వం HIV/AIDS సంబంధించి ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. అందులో ముఖ్యంగా పాజిటివ్‌ పర్సన్స్‌ ఎలాంటి వివక్షకు గురికాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిది, వ్యవస్థలది, సంస్థలది. ముఖ్యంగా HIV/AIDS సోకిన వ్యక్తిని దూరంగా ఉంచడం, వేరే ఇంటిలో ఉంచడం, పనిలో వారి మీద వివక్షత చూపడం లాంటి విషయాలు జరుగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. 

చట్టాలు ఒకప్రక్కన ఉన్నప్పటికీ మన ఆలోచన విధానాలలో మార్పు ఎంతైన ఉన్నది. HIV/AIDS ఉన్న వ్యక్తితో కలిసి భోజనం చేసినా, వారి బట్టలు వేసుకున్నా, కలిసి ప్రయాణం చేసినా HIV/AIDS రాదు. వారిని మన కుటుంబంలో, మన పనిలో ఒక భాగంగా చూడాలని ‘‘నా ఆరోగ్యం- నా హక్కు’’ అనే నినాదంతో HIV/AIDS ను ధైర్యంగా ఎదుర్కొని దానిని నివారిద్దాం. 
       

గ్రేస్‌ నిర్మల మల్లెల
సామాజిక కార్యకర్త
9059407946

Advertisement
Advertisement