జీఎస్టీ బిల్లు వాయిదా! | Sakshi
Sakshi News home page

జీఎస్టీ బిల్లు వాయిదా!

Published Sun, Dec 20 2015 2:00 AM

జీఎస్టీ బిల్లు వాయిదా! - Sakshi

సంకేతాలిచ్చిన ఆర్థికమంత్రి జైట్లీ
ఈ సమావేశాల్లోనే ‘దివాళా’ బిల్లు తీసుకువస్తామని వెల్లడి

 
 న్యూఢిల్లీ: ప్రస్తుత  పార్లమెంట్ సమావేశాల్లో వస్తువులు,  సేవల పన్ను(జీఎస్టీ) బిల్లును ప్రవేశపెట్టకపోవచ్చని  ఆర్థికమంత్రి జైట్లీ సంకేతాలిచ్చారు. కాంగ్రెస్ ఈ బిల్లుకు కొర్రీలు వేస్తూ అట్టుకుంటోందని ఆరోపించారు. దేశ అభివృద్ధి మందగమనంలో ఉంటే చూసి కొందరు పైశాచిక ఆనందం పొందుతారని మండిపడ్డారు. దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ప్రస్తుత సమావేశాల్లోనే దివాళా బిల్లు తీసుకువస్తామని చెప్పారు. శనివారమిక్కడ ఫిక్కీ ఏజీఎం సమావేశంలో జైట్లీ ప్రసంగించారు. ‘‘లోపాలతో కూడిన జీఎస్టీ బిల్లు తెచ్చే కన్నా.. ఆలస్యం అయినా సరే ఎలాంటి లోపాలు లేకుండా బిల్లు తెస్తేనే మంచిది. అయినా విపక్షంతో సంప్రదింపులు కొనసాగిస్తాం’’ అని  అన్నారు. మరోవైపు, జీఎస్టీ బిల్లు ఈసారి కార్యరూపం దాల్చబోదని కాంగ్రెస్ నేత ఆనంద్‌శర్మ చెప్పారు.

తాము ఈ బిల్లుపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని అయితే అందుకు ఇది సరైన సమయం కాదని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచే బిల్లును కచ్చితంగా అమలు చేయాలన్న అగత్యమేమీ లేదన్నారు. జీఎస్టీ బిల్లును తామే రూపొందించామని, అది తప్పకుండా కార్యరూపం దాలుస్తుందని పేర్కొన్నారు. జీఎస్‌టీ బిల్లు.. త్రిమూర్తులు భువికి దిగొచ్చినా..  2016 ఏప్రిల్ 1 వరకు ఆమోదం పొందటం కష్టమని వ్యాఖ్యానించారు. ప్రధాని, విపక్షనేతలు డ్యూయెట్ పాడుకున్నా, అందరూ కలిసి ఓవర్‌టైమ్ శ్రమించినా.. ఈ బిల్లును గట్టెక్కించలేరన్నారు. సగం రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించాల్సి ఉందని.. రాష్ట్ర జీఎస్‌టీ, కేంద్ర జీఎస్‌టీ, ఐజీఎస్‌టీ వంటి మూడు చట్టాలను పరిశీలించాల్సి ఉందన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత పరోక్షపన్నుల విధానంలో భారీ సంస్కరణలకు బాటలు వేస్తున్నట్లుగా భావిస్తున్న జీఎస్‌టీని రాజ్యసభలో ఇతర పక్షాలు మద్దతిస్తున్నా.. కాంగ్రెస్ మోకాలడ్డుతున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement