ఆమోదం! | Sakshi
Sakshi News home page

ఆమోదం!

Published Thu, Oct 2 2014 1:36 AM

ఆమోదం! - Sakshi

సాక్షి, చెన్నై : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పదవి నుంచి ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్‌కు విముక్తి లభించింది. ఆయన విజ్ఞప్తికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోద ముద్ర వేసింది. త్వరలో రాష్ట్రానికి కొత్త ఎన్నికల అధికారి నియమితులు కానున్నారు.
 ఎన్నికల ప్రధాన అధికారిగా నరేష్ గుప్తా గతంలో రాష్ర్టంలోని రాజకీయ పక్షాలకు ముచ్చెమటలు పట్టించారు. తాను పదవీ విరమణ పొందడంతో తన స్థానంలో ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సిఫారసు చేశారు. నరేష్ గుప్తా వారసుడిగా 2010లో ప్రధాన ఎన్నికల అధికారి బాధ్యతల్ని ప్రవీణ్‌కుమార్ చేపట్టారు.

నరేష్ గుప్తా తరహాలో రాష్ట్రంలో ఎన్నికల్ని కొత్త ఈసీ విజయవంతం చేశారు. నగదు బట్వాడా కట్టడి లక్ష్యంగా తీవ్రంగానే శ్రమించారు. 2011 అసెంబ్లీ ఎన్నిక లను ప్రశాంత పూరిత వాతావరణంలో విజయవంతం చేయడానికి సరికొత్త పద్ధతుల్ని అనుసరించిన ప్రవీణ్‌కుమార్, చివరకు రాజకీయ పక్షాల నుంచి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నిజాయితీగా వ్యవహరించినందుకు గాను ఆరోపణలు ఎదురు కావడంతో మనస్థాపం చెందిన ఆయన తనను బాధ్యతల నుంచి తప్పించాలని 2012లో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.

ఆయన నిజాయితీకి పెద్ద పీట వేసిన కేంద్ర ఎన్నికల కమిషన్ ఒత్తిడి తెచ్చి ఆ పదవిలో కొనసాగేలా చర్యలు తీసుకుంది. 2014 లోక్ సభ ఎన్నికలను సైతం ఆయన విజయవంతం చేశారు. అయితే, ఆ ఎన్నికల్లోను ఆయనపై ఆరోపణలు బయలుదేరడంతో ఇక తనను తప్పించాల్సిందేనని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందే, లోక్ సభ ఎన్నికల అనంతరం బాధ్యతల నుంచి తాను తప్పుకుంటానని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
 
ఆమోదం : తాను బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రవీణ్‌కుమార్ ప్రకటించినా, ఆయన సేవల్ని కొనసాగించుకునేందుకు ఎన్నికల యంత్రాంగం ప్రయత్నించింది. గత నెల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల పర్యవేక్షణాధికారిగా నియమించింది. అయినా, పట్టు వదలని విక్రమార్కుడిలా తనను తప్పించండంటూ పదే పదే ఈసీకి ప్రవీణ్ విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఆయన విజ్ఞప్తికి ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల యంత్రాంగం స్పందించింది. ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తప్పించేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రానున్నాయి.
 
త్వరలో కొత్త ఈసీ :
 తనను బాధ్యతల నుంచి తప్పించేందుకు కేంద్ర ఎన్నికల యంత్రాంగం ఆమోదం తెలియజేయడంతో ప్రవీణ్‌కుమార్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంగా మీడియా ప్రతినిధులతో ఆయన పేర్కొంటూ, తనను పదవి నుంచి తప్పించేందుకు ఆమోదం తెలియజే శారని, త్వరలో కొత్త ఈసీ రాబోతున్నారని స్పష్టం చేశారు. శ్రీరంగం ఉప ఎన్నికలు కొత్త ఈసీ నేతృత్వంలో జరిగే అవకాశాలు ఎక్కువే అన్న భావనను వ్యక్తం చేశారు.

జయలలితకు శిక్ష పడిన దృష్ట్యా, శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్టేనని, అయితే, అసెంబ్లీ కార్యదర్శి నుంచి ఇంత వరకు ఎన్నికల యంత్రాంగానికి ఎలాంటి అధికారిక లేఖ రాలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం ఎన్నికల కమిషన్ ఐఏఎస్ అధికారుల జాబితాను సేకరించనున్నదని, ఆ జాబితా మేరకు తదుపరి అన్ని అర్హతలు ఉన్న ఐఏఎస్ అధికారి కొత్త  ఈసీగా నియమితులవుతారని  పేర్కొనడం విశేషం.

Advertisement
Advertisement