చరిత్ర కళ్లకు గంతలు వద్దు | Sakshi
Sakshi News home page

చరిత్ర కళ్లకు గంతలు వద్దు

Published Fri, Dec 30 2016 1:53 AM

చరిత్ర కళ్లకు గంతలు వద్దు

తిరువనంతపురం: చరిత్రను వివరించేటపుడు కళ్లకుగంతలు కట్టుకుని చూపే దేశభక్తి వద్దని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. ఒక వాదనను సమర్థించేందుకు సత్యంతో రాజీ పడవద్దని చరిత్రకారులకు సూచించారు. గురువారం ఇక్కడ 77వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చరిత్ర పరిశీలనలో ఎంత వీలైతే అంత నిష్పాక్షికంగా వ్యవహరించాలన్నారు. సందేహాలు వెలిబుచ్చే స్వేచ్ఛ, విభేదించడం, మేధోపర సంవాదం తదితరాలను పరిరక్షించాలని, ఇవి ప్రజాస్వామ్యానికి కీలకమని తెలిపారు. ప్రజలు దేశంపై ప్రేమను కలిగి ఉండటం సహజమని, చరిత్ర ద్వారా గత కీర్తిని తెలుసుకుంటారని చెప్పారు. అయితే చరిత్రను ఒకేకోణంలో చూపే ఫలితంగా దేశభక్తి ఉండకూడదన్నారు.

ఏ సమాజం కూడా సమగ్రంగా ఉండదని, చరిత్రలో లోపాలను, వివాదాలను, తప్పులను చూపే గైడ్‌లా చరిత్ర ఉండాలని ప్రణబ్‌ చెప్పారు. బహుళత్వం, సామాజిక, సాంస్కృతిక, భాషా వైవిధ్యం భారత శక్తి అని ఆయన అన్నారు. స్థానిక చరిత్రను ప్రచారం చేసే సందర్భంగా దేశ చరిత్రతో వైరుధ్యం ఉండకూడదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చరిత్రను వక్రీకరిస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా హిస్టరీ కాంగ్రెస్‌ ప్రొసీడింగ్స్‌ తొలికాపీని ప్రణబ్‌ విడుదల చేశారు. 

Advertisement
Advertisement