కుమారై ఆటను ఆస్వాదిస్తున్న ప్రియాంక గాంధీ | Sakshi
Sakshi News home page

కుమారై ఆటను ఆస్వాదిస్తున్న ప్రియాంక గాంధీ

Published Tue, Feb 2 2016 7:53 PM

కుమారై ఆటను ఆస్వాదిస్తున్న ప్రియాంక గాంధీ

చెన్నై: ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ మంగళవారం పుదుచ్చేరిలో ప్రత్యక్షమయ్యారు. ఆమె తన కుమార్తె మిరయా వధేరా, కుమారుడు రైహన్ వధేరాలతో కలిసి మూడు రోజుల పాటు ఇక్కడే బస చేయనున్నారు. పుదుచ్చేరిలో మంగళవారం జాతీయ స్థాయిలో సబ్ జూనియర్ బాస్కెట్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి.

మిరయా వధేరా హర్యానా జట్టులో క్రీడాకారిణిగా ఉన్నది. దీంతో కుమార్తెకు తోడుగా ప్రియాంక వచ్చారు. రాజీవ్‌గాంధీ స్టేడియానికి ప్రియాంక వచ్చినా, అక్కడ ఎలాంటి భద్రతా హడావుడి కన్పించలేదు. అయితే, ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బలగాలు మఫ్టీలో విధులు నిర్వహిస్తున్నాయి. తొలిరోజు తమిళనాడుతో హర్యానా జట్టు తలపడింది.

ఇందులో తొలి పదిహేను నిమిషాల పాటు మిరయా మైదానంలోకి రాలేదు. తమిళనాడు జట్టు ఆది నుంచి దూకుడు ప్రదర్శించి మంచి పాయింట్లను దక్కించుకుంది. తదుపరి మిరయా రంగంలోకి దిగి తన క్రీడా నైపుణ్యాన్ని చాటుకున్నారు. అయితే తొలి నుంచి దూకుడు ప్రదర్శించిన తమిళనాడు జట్టే చివరకు విజయకేతనం ఎగురవేసింది. సముద్ర తీరంలోని ఓ హోటల్‌లో పిల్లలతో కలసి ప్రియాంక బసచేయనున్నారు.
 

Advertisement
Advertisement