షాకింగ్‌ వీడియో: కళ్లు మూసుకోండి అంటూ..

30 Mar, 2020 15:26 IST|Sakshi

లక్నో: ‘‘మీ కళ్లు మూసుకోండి. పిల్లల కళ్లు కూడా మూయండి’’ అంటూ వలస కూలీలపై రసాయనాలు వెదజల్లిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వలస కూలీలు పట్టణాల నుంచి స్వస్థలాలకు పయనమవుతున్నారు. చిన్నా పెద్దా.. అంతా కాలి నడకన ఇంటి బాట పడుతున్నారు.(కరోనా: గుడ్‌న్యూస్‌ చెప్పిన జర్నలిస్టు)

ఈ క్రమంలో యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో కొంత మంది వలస కూలీలు బరేలీ జిల్లాకు చేరుకున్నారు. అయితే వారు బస్సు నుంచి దిగగానే అధికారులు అందరినీ ఒక్కచోట చేర్చి పైపులతో వారిపై రసాయన ద్రావణాన్ని స్ప్రే చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసిన కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘మనమంతా కరోనాపై పోరాడుతున్నాం. అయితే ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడటం మంచిది కాదు. ఇప్పటికే ఆ కార్మికులు ఎంతో బాధ అనుభవించి ఉన్నారు. వారిపై రసాయనాలు చల్లకండి. ఇవి వాళ్లను రక్షించకపోగా... మరింత హాని చేస్తాయి’’అని ట్వీట్‌ చేశారు. (వైరస్ ప్లాస్టిక్‌పైన 72 గంటలు బతుకుతుంది)

అదే విధంగా బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి సైతం అధికారుల చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో విమర్శలపై స్పందించిన బరేలీ జిల్లా మెజిస్ట్రేట్‌... బస్సులను మాత్రమే శుభ్రం చేయమని ఆదేశించామని.. అయితే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. అధికారులకు తెలియకుండా ఈ చర్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. వలస కూలీలపై క్లోరిన్‌, నీళ్లు మాత్రమే చల్లారని వివరణ ఇచ్చారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు