కంతు ప్రకంపన | Sakshi
Sakshi News home page

కంతు ప్రకంపన

Published Wed, Oct 25 2017 7:00 AM

protest against finaniars harassments

కంతు వడ్డీ వేధింపుల ఆత్మాహుతి ఘటన రాష్ట్రంలో ప్రకంపనలకు దారితీసింది. తమకంటే, తమకు వేధింపులు పెరిగాయంటూ బాధితులు పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. ఇక, ఇంటెలిజెన్స్‌ విచారణలో గతంలో స్టేషన్లలో వెయ్యికి పైగా కంతు వడ్డీ ఫిర్యాదులు వచ్చినా కనీసం వాటి మీద ఆయా స్టేషన్ల అధికారులు దృష్టి పెట్టలేదని తేలింది. దీంతో స్టేషన్లలోని అధికారుల భరతం పట్టాల్సిందేనన్న నినాదం తెరమీదకు వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో అయితే, రాష్ట్ర పోలీసుల తీరుపై విమర్శల జోరు పెరిగింది. అలాగే, తిరునల్వేలి ఎస్పీ, కలెక్టర్‌లపై చర్యకు డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఆందోళనలు హోరెత్తాయి.

సాక్షి, చెన్నై : రాష్ట్రంలో చిరు వ్యాపారులు, రోడ్డు పక్కన వ్యాపారులే కాదు, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వాళ్లు అత్యధికంగా కంతు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించక తప్పడం లేదు. అధిక వడ్డీకి అప్పులు చేసి మరీ జీవనం సాగించాల్సిన పరిస్థితులు అనేకచోట్ల ఉన్నాయని చెప్పవచ్చు. వారం, పది రోజులు, నెల గడవుతో, కంతుల వారీగా చెల్లింపులు సాగే విధంగా కంతు వడ్డీ  జోరుగా సాగుతోంది. ప్రధానంగా దక్షిణ తమిళనాడులోని విరుదునగర్, తిరునల్వేలి, రామనాథపురం, తేని, మదురై వంటి జిల్లాల్లో కంతు వడ్డీ అనేది ఓ వ్యాపారంగా మారింది. తిరునల్వేలిలో అయితే, మరీ ఎక్కువే. వందకు పది, పదిహేను రూపాయలు చొప్పున వడ్డీలకు అప్పులు తీసుకునే వాళ్లూ ఉన్నారు. నిర్ణీత గడువులో ఆ మొత్తాన్ని చెల్లించకుంటే, వడ్డీ రెట్టింపు అవుతూ, అస్సలు కన్నా, వడ్డీ  ఎక్కువగా చెల్లించే పరిస్థితులు తప్పదు.

పోలీసులు, రాజకీయనేతల మద్దతు
కంతు వడ్డీ వ్యాపారులకు పోలీసులు, స్థానికంగా రాజకీయ వర్గాల మద్దతు ఎక్కువే. అందుకే పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించడమే కాదు, తీసుకున్న వారికి బెదిరింపులు, వేధింపులు ఇవ్వడం పరిపాటే. వేధింపులు తాళ లేక బలవన్మరణాలకు పాల్పడే కుటుంబాలు ఎన్నో. అయితే, చర్యలు శూన్యం. ఈ కంతు వడ్డీని అడ్డుకునే విధంగా 2003లోని అమ్మ జయలలిత ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆమేరకు కంతు వడ్డీ బాధితుల్ని ఆదుకోవడంతో పాటు, వేధించే వారికి మూడేళ్లు జైలు శిక్ష పడే రీతిలో చర్యలు తీసుకున్నా, అది అమలుచేసిన వాళ్లే లేరు. తాజాగా అదే కంతు వడ్డీ వేధింపులకు తిరునల్వేలి కలెక్టరేట్‌లో కుటుంబం ఆత్మాహుతి యత్నం చేసి ప్రకంపనను సృష్టించింది. దీంతో కంతు వేధింపులు ఒక్కొక్కటిగా తెరమీదకు వస్తున్నాయి.

చర్యలకు పట్టు
ఆ కుటుంబం పలు మార్లు విన్నవించుకున్నా, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం వర్గాలు స్పందించని దృష్ట్యా, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టే వాళ్లు పెరిగారు. ఇదే నినాదంతో తిరునల్వేలి కలెక్టరేట్‌ మంగళవారం దద్దరిల్లింది. ఇక, రాజకీయ పక్షాలు ప్రభుత్వ, పోలీసుల తీరుపై విమర్శల జోరును పెంచారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్‌ వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ, పోలీసుల పనితీరుపై దుమ్మెత్తిపోశారు. కంతు వడ్డీ బాధితుల్ని ఇకనైనా ఆదుకునేలా చర్యలు వేగవంతం చేయాలని డిమాండ్‌  చేశారు. తమిళ మానిల కాంగ్రెస్‌ నేత జీకే వాసన్, తమిళనాడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్‌ తదితరులు ఇకనైనా మేల్కొనాలని, ఆ మరణాలకు న్యాయం చేకూరే విధంగా కంతు వడ్డీ భరతం పట్టే విధంగా ముందుకు సాగాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. మదురై ధర్మాసనంలో ఓ పిటిషన్‌ సైతం దాఖలు అయింది. గాంధీ అనే న్యాయవాది కంతు వడ్డీ వేధింపులు, చట్టం గురించి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక విభాగం ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. ఇదే సమయం అని, కంతు వడ్డీని అడ్డుకునే విధంగా చర్యలు వేగవంతం చేయాలని, ప్రత్యేక విభాగం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రకంపనలు
ఆత్మాహుతి యత్నం చేసిన నలుగురిలో ఇసక్కి ముత్తు మినహా భార్య, పిల్లలు మరణించారు. వారి మృత దేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు మంగళవారం  అప్పగించారు. ఆ మృతదేహాలకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈకేసులో ఇద్దర్ని అరెస్టుచేసి ప్రత్యేక సెక్షన్లను నమోదు చేశారు. అయితే, వారి మరణం రాష్ట్రంలో ఓ ప్రకంపనకు దారితీసింది.  పాలకులు, పోలీసుల్ని తట్టి లేపే రీతిలో బలిదానం ఓవైపు సాగితే, మరోవైపు తమకంటే తమకు వేధింపులు పెరిగాయని, ఆదుకోవాలంటూ బాధితులు పోలీసుల్ని ఆశ్రయించే పనిలో పడ్డారు. మంగళవారం వందకు పైగా ఫిర్యాదుల రావడంతో ఇంటెలిజెన్స్‌ వర్గాలు కంతు వడ్డీ వ్యవహారం మీద దృష్టి పెట్టడం గమనార్హం. గతంలో వెయ్యి వరకు ఫిర్యాదులు ఆయా స్టేషన్లకు వచ్చినా పట్టించుకున్న పోలీసు లేదని విచారణలో వెలుగు చూసి ఉన్నది. ఈ సమాచారంతోనైనా డీజీపీ కార్యాలయం స్పందిస్తుందని భావిస్తే, అక్కడ నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడకపోవడంతో విమర్శలు జోరందుకున్నాయి. సామాజిక మాధ్యమాల్లో పోలీసులపై దుమ్మెత్తి పోసే వాళ్లు పెరిగారు. ఇక, సీఎం, సీఎస్,  హోం కార్యదర్శులు స్పందించాలని డిమాండ్‌ చేసే వాళ్లు మరీ ఎక్కువే. కోర్టు జోక్యం చేసుకోవాలని, చట్టం కఠినంగా అమలుచేయాలని విన్నవించే వాళ్లూ పెరిగారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement