‘మీ ఇంట్లో ఒక్కరైనా సైన్యంలో ఉంటే తెలిసేది’ | Sakshi
Sakshi News home page

ట్రోలర్స్‌కు అమర జవాను భార్య సమాధానం

Published Fri, Mar 1 2019 10:07 AM

Pulwama Attack Killed Soldier Wife Answer To Trollers - Sakshi

కోల్‌కతా : ‘ ఇంట్లో కూర్చుని కొంత మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మాటలకే పరిమితమైపోతారు తప్ప తమ కుటుంబ సభ్యుల్లో ఒక్కరినైనా భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సు, పారామిలిటరీ దళాల్లోకి పంపించరు. అందుకే నా లాంటి వారి బాధ.. వారికి ఎన్నటికీ అర్థం కాదు’ అంటూ అమర జవాను భార్య తనను ట్రోల్‌ చేసిన వారికి గట్టిగా సమాధానం చెప్పారు. జైషే మహ్మద్ ఉగ్రవాది ఆదిల్‌.. కశ్మీర్‌లోని పుల్వామాలో ఆత్మాహుతికి పాల్పడి 40 మందికి పైగా భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా భారత వైమానిక దళం పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేయడం... వీటిని తిప్పి కొట్టేందుకు పాక్‌ ప్రయత్నించడం.. ఈ క్రమంలో భారత పైలట్‌ వారికి చిక్కడం వంటి ఘటనలతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిందే అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.


 
ఈ నేపథ్యంలో పుల్వామా దాడిలో అమరుడైన బబ్లూ సంత్రా అనే జవాను భార్య మిథా మాట్లాడుతూ... ‘ భారత్‌ చర్చలకే మొగ్గు చూపాలి. యుద్ధం వల్ల ఇరు దేశాల సైనికుల ప్రాణాలు పోతాయి. అందుకే శాంతియుతంగా చర్చించి భారత పైలట్‌ను క్షేమంగా తీసుకురావాలి’ అని వ్యాఖ్యానించారు. దీంతో సోషల్‌ మీడియాలో ఆమెపై పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరిగింది. ఈ విషయంపై స్పందిస్తూ... ‘ ఫిబ్రవరి 14న జరిగిన ఘటన నన్ను ఏమాత్రం కుంగదీయలేకపోయింది. శాంతి గురించి మాట్లాడినందుకు నేను యుద్ధ వ్యతిరేకిగా మారానని కొం‍దరు అంటున్నారు. మరికొంత మంది భర్తపై నా ప్రేమను శంకిస్తున్నారు. ఇంట్లో కూర్చుని ఎన్నైనా మాట్లాడతారు. మీ ఇంట్లో ఒక్కరైనా సైన్యంలో ఉంటే తెలిసేది. అయినా అటువంటి వారి గురించి నేను అస్సలు పట్టించుకోను’ అని మిథా ట్రోలర్స్‌కు ఘాటు సమాధానమిచ్చారు.

కాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన మిథా ప్రస్తుతం ఓ ప్రైవేటు పాఠశాలలో టీచరుగా పనిచేస్తున్నారు. మోడ్రన్‌ హిస్టరీలో మాస్టర్స్‌ చేసిన ఆమెకు భర్త మరణానంతరం సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగం చేయమని ఆఫర్‌ వచ్చింది. అయితే ఆరేళ్ల కూతురిని, వృద్ధురాలైన అత్తగారిని చూసుకునేందుకు ఆమె ఈ ఆఫర్‌ను తిరస్కరించారు. భర్త భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన సమయంలో మంత్రులు ఇచ్చిన హామీ మేరకు.. తనకు ప్రభుత్వ ఉద్యోగం  ఇవ్వాలని మిథా కోరారు.

Advertisement
Advertisement