మృతురాలి కుటుంబాన్ని కలవనున్న సీఎం | Sakshi
Sakshi News home page

మృతురాలి కుటుంబాన్ని కలవనున్న సీఎం

Published Sun, May 3 2015 6:54 PM

మృతురాలి కుటుంబాన్ని కలవనున్న సీఎం

కదులుతున్న బస్సులో లైంగిక వేధింపులకు పాల్పడి ఆపై తల్లీబిడ్డలను కిందకు తోసివేసిన దారుణ ఘటనపై పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ఎట్టకేలకు స్పందించారు. మోగా జిల్లా నాలుగు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన సహించరానిదని, 16 ఏళ్ల బాలిక మరణం అత్యంత బాధాకరమన్నారు. మోగా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బైఠాయించిన మృతురాలి కుటుంబాన్ని స్వంయంగా వెళ్లి కలుస్తానని చెప్పారు. అకాలీదళ్ మాజీ మంత్రి అజైబ్ సింగ్ మాతృమూర్తికి శ్రద్ధాంజలి ఘటించేందుకు ఆదివారం పటియాలాకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే తమ కుటుంబానికి చెందిన 'ఆర్బిట్ ఏవియేషన్' రవాణా సంస్థ అనుమతుల రద్దుపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.

మరోవైపు ఆసుపత్రివద్ద బైఠాయించిన మృతురాలి కుటుంబ సభ్యులకు మద్దతు తెలిపేందుకు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వ వ్యతికేర నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాలుగు రోజులుగా మోగా ఆసుపత్రి మార్చురీలోనే ఉన్న బాలిక మృతదేహానికి అంత్యక్రియలు జరిపేందుకు ఆమె తండ్రి అంగీకరించారని పోలీసులు ప్రకటించారు. కానీ పోలీసులు తమను ఒత్తిడి చేస్తున్నారని, రాజీ కుదుర్చుకోవాల్సిందిగా బలవంతం చేస్తున్నారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. బస్సు యజమానుదారుడైన డిప్యూటీ సీఎం, హోంమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కేసు నమోదుచేసి, ఆయనకు చెందిన ‘ఆర్బిట్ ఏవియేషన్’ సంస్థ రవాణా అనుమతులను రద్దు చేసేవరకు తమ పట్టు వీడబోమంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement