అసెంబ్లీలోనే ఎమ్మెల్యేల నిద్ర.. నిరసన కొనసాగింపు | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలోనే ఎమ్మెల్యేల నిద్ర.. నిరసన కొనసాగింపు

Published Tue, Sep 13 2016 2:34 PM

అసెంబ్లీలోనే ఎమ్మెల్యేల నిద్ర.. నిరసన కొనసాగింపు

పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతున్నారు. సోమవారం నాడు సభలో తాము పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తర్వాతి నుంచి ఇప్పటివరకు వాళ్లంతా అసెంబ్లీలోనే ఉండిపోయారు. నేలమీదే పడుకోవడం, అక్కడే బ్రష్ చేసుకోవడం.. నిరసన కొనసాగించడం.. ఇదీ ఎమ్మెల్యేల కార్యక్రమంగా మారింది. అసెంబ్లీ హాలును ఖాళీ చేసి వెళ్లాలని ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కోరినా ఎమ్మెల్యేలు మాత్రం పట్టు వీడలేదు.

సోమవారం సభ వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ నుంచి వెళ్లేందుకు ఎమ్మెల్యేలు నిరాకరించారు. అధికారంలో ఉన్న అకాలీదళ్ - బీజేపీ ప్రభుత్వంపై తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మీద మళ్లీ కొత్తగా చర్చ మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ అధికారులు మొత్తం లైట్లు, ఏసీలు ఆపేశారని, తమకు చాలా సేపటి వరకు కనీసం తిండి, నీళ్లు కూడా లేవని ప్రతిపక్ష నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీ చెప్పారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అసెంబ్లీ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలు మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే వెలుతురులోనే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ.. తమకు తామే గాలి విసురుకుంటూ గడిపారు.

వచ్చే సంవత్సరం పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఇదే చిట్టచివరి సమావేశం కావడంతో ఎలాగైనా ప్రజల దృష్టిని ఆకట్టుకోవాలని కాంగ్రెస్ ఈ వ్యూహం రచించింది. మంగళవారం బక్రీద్ సెలవు కాగా, బుధవారంతో అసెంబ్లీ ముగిసిపోతుంది. సీనియర్ ఎమ్మెల్యేలు చాలామంది వెళ్లిపోయినా.. యువ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీలోనే ఆగిపోయారు. కాంగ్రెస్‌కు పంజాబ్‌లో మొత్తం 42 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో 27 మంది నిరసనలో పాల్గొన్నారు. వాళ్లందరికీ పంజాబ్ పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ కేఎఫ్‌సీ నుంచి ఆహారం పంపారు.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement